Last Updated:
Kakinada జిల్లా కృష్ణవరం టోల్గేట్ వద్ద 500కు పైగా తాబేళ్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం అటవీ అధికారులు అడ్డుకున్నారు. Yeleru Reservoirలో వాటిని విడిచిపెట్టారు.
మన సంస్కృతిలో కూర్మావతారంగా భావించి పూజించే తాబేలు.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖరీదైన ఆహారంగా మారిందా? వాటికి ఉన్న డిమాండ్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని వందలాది తాబేళ్లను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే యత్నం బయటపడటం కలకలం రేపింది. ఏకంగా 30 మూటల్లో నింపి బొలెరో వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు అటవీ అధికారులను అప్రమత్తం చేశాయి.
కాకినాడ (Kakinada) జిల్లా లోని ప్రతిపాడు నియోజకవర్గం, కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద ఈ అక్రమ రవాణా బట్టబయలైంది. జిల్లా డీఎఫ్వో ఆదేశాల మేరకు ఏలేశ్వరం రేంజ్ అటవీ అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా షాకింగ్ దృశ్యం కనిపించింది. 30 మూటల్లో దాదాపు 500కు పైగా తాబేళ్లు కుక్కి పెట్టి తరలిస్తున్నారు. వెంటనే స్పందించిన అధికారులు వాటిని బయటకు తీసి ప్రత్యేక ప్లాస్టిక్ తొట్టెల్లో నీళ్లు పోసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం వాటిని సురక్షితంగా Yeleru Reservoirలో విడిచిపెట్టారు.
ప్రాథమిక విచారణలో గోదావరి జిల్లాలోని అమలాపురం, రామచంద్రాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల నుంచి ఈ తాబేళ్లను సేకరించినట్లు తెలిసింది. వీటిని West Bengal, Odisha వంటి రాష్ట్రాలకు తరలించేందుకు ప్లాన్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అక్కడ తాబేళ్లకు మంచి డిమాండ్ ఉండటం, ధరలు అధికంగా లభించడం వల్లే ఈ అక్రమ రవాణా సాగుతున్నట్లు సమాచారం.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం తాబేళ్లను పట్టడం, నిల్వ చేయడం, రవాణా చేయడం కఠినంగా నిషేధం. ఈ నేరంలో పాల్గొన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. “మూగజీవులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు. వన్యప్రాణి చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనివార్యం అంటూ స్పష్టం చేశారు. ఒకవైపు మనం తాబేళ్లను పవిత్రంగా భావిస్తుంటే, మరోవైపు వాటిని అక్రమంగా సేకరించి అమ్మకానికి పెట్టడం ప్రకృతి సమతుల్యతకే ముప్పు. అటవీ అధికారులు వేగంగా స్పందించి వందలాది తాబేళ్ల ప్రాణాలు కాపాడటంతో ఈ ఘటన పెద్ద ప్రమాదంగా మారకుండా నిలిచింది. ప్రకృతి సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


