ఒక దేశీ ఆవు ఉంటే చాలు.. ఇంట్లోనే పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం..! Panchagavya products offer hope for health and income | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)


Last Updated:

పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్య, పర్యావరణ హిత జీవనానికి తోడ్పడుతూ, దేశీ ఆవు ఆధారంగా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి.

+

రసాయనాలకు

రసాయనాలకు బదులు సహజ మార్గం  ఇంట్లోనే పంచగవ్య తయారీ

భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఆ ఆవు నుంచి లభించే ఐదు పవిత్ర పదార్థాల సమ్మేళనమే పంచగవ్య. “పంచ” అంటే ఐదు, గవ్య అంటే గోవు నుంచి లభించేవి. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం ఈ ఐదు కలిసినప్పుడు అది కేవలం ఒక సంప్రదాయ మిశ్రమం మాత్రమే కాదు, జీవన విధానంగా మారుతుంది. వేదకాలం నుంచే శుద్ధి క్రియల్లో, ఔషధాలలో, సహజ వ్యవసాయంలో పంచగవ్య వినియోగం కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు రసాయన ఉత్పత్తుల దుష్ప్రభావాల మధ్య మళ్లీ సహజ మార్గాల వైపు మళ్లుతున్న తరుణంలో పంచగవ్య ఉత్పత్తులకు కొత్త ఊపు వచ్చింది.

దేశీ ఆవు ఆధారంగా తయారయ్యే గృహోపయోగ ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ఇంటి వద్ద ఒక దేశీ ఆవు ఉంటేనే చాలనిపించేలా, గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలతో ధూప్ స్టిక్స్, సున్నిపిండి, అష్టదంత ధావన్ (పళ్ల పొడి), షాంపూ పౌడర్ వంటి అనేక వస్తువులు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు, పర్యావరణ హిత జీవనానికి కూడా తోడ్పడుతున్నాయి.

ఎండిన గోమయాన్ని గుగ్గిలం, చందనం పొడితో కలిపి కొద్దిగా నెయ్యి జతచేసి తయారు చేసే ధూప్ స్టిక్స్ వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. సహజ సువాసనతో ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయి. రసాయన అగరబత్తీలకు ప్రత్యామ్నాయంగా ఇవి ప్రాచుర్యం పొందుతున్నాయి. అలాగే శనగపిండి, వేపాకు, గంధకచ్చూరాలు, మారేడు గుజ్జు వంటి మూలికలతో పాటు గోమయ పొడి కలిపి తయారు చేసే సున్నిపిండి చర్మానికి సహజ శుభ్రతను ఇస్తుందని విశ్వసిస్తున్నారు. అష్టదంత ధావన్‌గా తయారు చేసే పళ్ల పొడిలో గోమయ భస్మం, ఉసిరికాయ, లవంగం, వాము వంటి పదార్థాలు ఉండటం వల్ల దంతాలకు దృఢత్వం వస్తుందని ఉపయోగించే వారు చెబుతున్నారు. శికాకాయ, రీతా, ఆమ్లా పొడులతో తయారు చేసే షాంపూ పౌడర్ జుట్టుకు సహజ మెరుపు ఇవ్వడంలో ఉపయోగపడుతుందని వినియోగదారుల అభిప్రాయం.

ఈ పంచగవ్య ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విజయవంతంగా మార్కెటింగ్ చేస్తున్న హరి చెబుతున్నదేమిటంటే.. పరిశుభ్రత, సరైన నిష్పత్తి, ఎండబెట్టే విధానం, నిల్వ పద్ధతి ఇవే విజయానికి కీలకం. దేశీ ఆవు నుంచి లభించే పదార్థాలను శుభ్రంగా సేకరించి ప్రమాణాలతో తయారు చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొంటున్నారు. గ్రామీణ స్థాయిలో స్వయం ఉపాధికి ఇది మంచి అవకాశమని, చిన్న స్థాయిలో మొదలుపెట్టి పెద్ద వ్యాపారంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.

రసాయన ఉత్పత్తుల వల్ల చర్మం, జుట్టు, పళ్లు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సహజ ప్రత్యామ్నాయాల కోసం ప్రజలు వెతుకుతున్నారు. అలాంటి సమయంలో పంచగవ్య ఉత్పత్తులు ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన ఎంపికగా నిలుస్తున్నాయి. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మలిస్తే ఇది కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా ఆర్థిక వనరుగా కూడా మారగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటి వద్ద దేశీ ఆవు ఉంటే ఈ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసుకుని ఉపయోగించడమే కాకుండా, ఆదాయ మార్గంగా కూడా మలుచుకోవచ్చు. సహజతను కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించాలనుకునే వారికి పంచగవ్య మరోసారి ఆశాకిరణంగా మారుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *