Last Updated:
భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుల అరాచకంపై టీడీపీ జ్యోత్స్న తిరునగరి తీవ్రంగా మండిపడి, దేశ పరువు దెబ్బతీసిందని విమర్శించారు.
ఢిల్లీలోని భారత మండపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో యూత్ కాంగ్రెస్ నాయకులు సృష్టించిన గందరగోళంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ నిరసనలు యావత్ దేశానికే అవమానకరమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి విమర్శించారు. చవకబారు రాజకీయాల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరీ ఇంత దిగజారి ప్రవర్తించడం చాలా దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా పార్లమెంటులో ప్రధానమంత్రి మాట్లాడకుండా అడ్డుకోవడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఒక అంతర్జాతీయ సదస్సులో అర్ధనగ్న ప్రదర్శనలు చేసి దానికి ప్రజాస్వామ్య నిరసన అని పేరు పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఏఐ సమ్మిట్‌ను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది గ్లోబల్ లీడర్లు, టెక్ దిగ్గజాలు భారత్‌కు వచ్చారని ఆమె గుర్తుచేశారు. ఇలాంటి అద్భుతమైన అంతర్జాతీయ వేదికపై కాంగ్రెస్ శ్రేణులు ఒక వీధి నాటకం తరహాలో రచ్చ చేసి, దేశ పరువును విదేశీయుల ముందు బజారున పడేశారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
VIDEO | “Opposition’s protest at India AI Impact Summit is an embarrassment to the nation”, says TDP spokesperson Jyothsna Tirunagiri.
She said, “The opposition has stooped to what I believe is the lowest of lows with their new strategy of political obstructionism over the past… pic.twitter.com/CiVzlH55yS— Press Trust of India (@PTI_News) February 21, 2026
ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ఉన్న విద్వేషాన్ని కాంగ్రెస్ నాయకులు ఇలా దేశంపై చూపిస్తున్నారని జ్యోత్స్న ఆరోపించారు. ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే వారు ఇలాంటి చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక పక్క దేశాన్ని ప్రపంచం ముందు నవ్వులపాలు చేస్తూ, మరోపక్క ఆ ఘటనను కాంగ్రెస్ నేతలు సమర్థించుకోవడం వారి వికృత చేష్టలకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే వేరే రూపంలో శాంతియుతంగా నిరసన తెలపాలి తప్పితే, ఇలాంటి అంతర్జాతీయ వేదికలను ఎంచుకుని దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె తేల్చిచెప్పారు. ఇది కచ్చితంగా దేశం పట్ల కాంగ్రెస్‌కు ఉన్న విద్వేషమేనని ఆమె స్పష్టం చేశారు.
యూత్ కాంగ్రెస్ ప్రతినిధులమని చెప్పుకుంటూ కొంతమంది యువకులు చేసిన ఈ అరాచకం భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. ప్రపంచ దేశాల ముందు కొత్త భారతాన్ని ఆవిష్కరించాల్సిన సమయంలో, ఇలా బట్టలు విప్పేసి గొడవలు చేయడం ద్వారా ప్రపంచానికి మన దేశం గురించి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామని ఆమె నిలదీశారు. దేశ అభివృద్ధిని ఏమాత్రం సహించలేక పోతున్న ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నాయని ఆరోపించారు. దేశ పురోగతిని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ఇలాంటి నీచమైన రాజకీయ క్రీడలను, కాంగ్రెస్ దుర్మార్గపు చర్యలను తెలుగుదేశం పార్టీ పక్షాన తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ఏఐ సమ్మిట్ వేదిక వద్దకు చొచ్చుకువచ్చారు. ప్లకార్డులు పట్టుకుని, తమ చొక్కాలు విప్పేసి అర్ధనగ్నంగా ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చిన యువకులు ఆందోళన చేయడంతో సదస్సులో ఉన్న విదేశీ ప్రతినిధులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ ఉన్న సామాన్య ప్రజలు సైతం కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. పది మంది యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి, మిగతా వారిని అక్కడి నుంచి పంపించేశారు. దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన ఒక సదస్సును ఇలా రాజకీయ రంగు పులిమి అడ్డుకోవాలని చూడటం పట్ల దేశవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



