చెన్నై : ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీ రాజా (85) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 2025 మార్చిలో భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషాదాన్ని భారతీరాజా తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతుంటారు. గత ఏడాది డిసెంబరులో శ్వాసకోశ సంబంధిత సమస్యల కారణంగా భారతీరాజాను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా 1977 లో విడుదలయిన 16 వయాతినిలే (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. గ్రామీణ నేపథ్య కథలను సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను ఆలరించాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 40 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన నటనతో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన తుడరుం చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు. అలాగే ఆయన నటించిన పులవర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయన చివరి సినిమా కానుంది.
నివాళులర్పించిన సీఎం విజయ్
భారతీరాజా మృతదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. తమిళనాడు సీఎం విజయ్ అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. భారతీరాజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సంతాపం తెలిపారు. డీఎంకే అధినేత స్టాలిన్, సినీ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు.


