లోకాన్ని ఉద్ధరిస్తున్నామని భ్రమపడే వారు నిజానికి తాము లోకాన్ని నాశనం చేస్తున్నారని గ్రహించరు. ప్రధానమంత్రి మోదీ అలాంటి వారే. ఆయన 12 ఏళ్ల ఏలుబడిని బేరీజు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ వాగాడంబరం విపరీతమైంది. 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో లెక్కే లేదు. ఈ వాగ్దానాలను నెరవేర్చడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఆయన సాధించారంటున్న విజయాలన్నీ మీడియాలో ప్రకటనలకే పరిమితమయ్యాయి. మీడియాలో వచ్చిన ఈ ప్రకటనలన్నింటికీ భారీ స్థాయిలో ప్రజాధనం వెచ్చించారు. మోదీ సాధించిన విజయాలన్నీ పెట్రోల్ బంకుల దగ్గర, ఇతర చోట్ల భారీ హోర్డింగులకే పరిమితం. ప్రస్తుతం ఎదురవుతున్న అపజయాలన్నింటికీ మునుపటి పాలకులే కారణం అని నిందించడం నిరంకుశాధికారం చెలాయించే వారందరికీ ఉన్న అలవాటే. ఇలా నెపం ఇతరుల మీద మోపడంలో మోదీ అద్వితీయుడు. మాట్లాడితే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన లోపాలను ఎత్తి చూపే క్రమంలో తన వైఫల్యాలను దాచేస్తుంటారు. కానీ 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న తన ప్రభుత్వం సాధించిందేమిటో వివరించే సాహసం మోదీ ఎప్పుడూ చేయరు. బాధ్యతాయుత ప్రభుత్వం అందించ లేకపోడం, అసమర్థ పాలనకు సంజాయిషీ చెప్పడం, వ్యవస్థీకృతమైన అవినీతిని పెంపొందిస్తున్నందుకు మోదీ ఎప్పుడో ఒకప్పుడు జవాబు చెప్పక తప్పదు. హిందుత్వ ఎజెండా అమలుచేస్తున్నాను కనక భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) మద్దతు ఉందని మోదీ మురిసిపోతుంటారు. అయితే అడపాదడపా ఆర్.ఎస్.ఎస్.అగ్రనేతలు కూడా పరోక్షంగానైనా మోదీ విషయంలో పెదవి విరిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువుల మద్దతు తనకు ఉందన్న ధీమా మోదీ ఇష్టారాజ్యానికి ఊతం ఇస్తోంది. అల్పసంఖ్యాక వర్గాల, ప్రత్యేకంగా ముస్లింల నుంచి 80 శాతంగా ఉన్న హిందువులకు ముప్పు ఉందని నమ్మించడంలో మోదీ కృతకృత్యులయ్యారు. అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులకు మోదీ పాలన వల్ల ఒరిగిందేమీ లేదు కానీ వారికి ముస్లింల నుంచి ముప్పు బూచి చూపి తనకు అనుకూలంగా ఓటు వేసేట్టు చేసుకోవడంలో మోదీ సఫలమైనట్టే. అయినా గత మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి ఎన్నడూ బీజేపీ కనీసం 50 శాతం ఓట్లైనా సాధించిందే లేదు. ఎన్నికల్లో ప్రజలు ఎవరిని సమర్థించినా మెరుగైన పాలన ఆశిస్తారు. కానీ మోదీ హిందువులను కాపాడడం అన్న కుహనా భరోసా ఆధారంగా బండి నడిపిస్తున్నారు. ఈ మిషతో తనకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చునని ఆయన నమ్ముతున్నారు. ఇతర వర్గాల వారి మాట ఎలా ఉన్నా అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులు కూడా వ్యక్తి ఆరాధనలో మునిగిపోయారు. తద్వారా సంక్రమించే దుష్పరిణామాలను వారూ ఎదుర్కోక తప్పడం లేదు. వాస్తవం ఏమిటంటే గత పన్నెండేళ్ల కాలంలో దుష్పరిపాలనకు, అసమర్థతకు ముస్లింలు ఏ రకంగానూ బాధ్యులు కారు. ఎందుకంటే సకల జీవన రంగాలలోనూ ముస్లింల పాత్రే లేకుండా చేసింది మోదీ పాలనే. ముస్లింలతో తమకేమీ పని లేదని బీజేపీ చెప్పుకుంటోంది. హిందువుల ఓట్లను సంఘటితం చేసుకోవడానికే ముస్లిం బూచి చూపుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. అసలు ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ అవకాశమే ఇవ్వడం లేదు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ముస్లింలు ఎవరూ కనిపించడం లేదు. పరిపాలనా విభాగాల్లో ముస్లింల ప్రాతినిధ్యమే లేకుండాపోతోంది. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. లాంటి పదవుల్లో ముస్లింలు క్రమంగా మృగ్యం అయిపోతున్నారు. అందువల్ల ఎదురవుతున్న అనేకానేక సమస్యలకు ముస్లింలే కారణం అని చెప్పడానికి వీలే లేదు. సకల అవకతవకలకు కాషాయ శిబిరానిదే బాధ్యత. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయినందు వల్ల హిందువులను పరిరక్షిస్తున్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఆ హిందువులు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆర్థిక వ్యవస్థ పతనానికి అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం కారణం అని కేంద్ర ప్రభుత్వం సాకులు చూపుతూ ఉండొచ్చు. కానీ అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులకు ఈ ప్రభుత్వ హయాంలో కలిగిన ప్రత్యేక మేలు ఏమీ లేదు. పరిపాలనా విభాగాల్లో కీలక పదవుల్లో ఉన్న హిందూ అధికారుల అసమర్థత వల్ల నష్టపోతున్న వారిలో అధిక సంఖ్యాకులు హిందువులే. హిందువులకు మార్కెట్లో ఏ వస్తువూ ముస్లింలకన్నా తక్కువ ధరకు దొరకదు కదా! పరీక్ష పత్రాలు లీక్ అయినందు వల్ల నష్టపోయిన విద్యార్థుల్లో అధిక సంఖ్యాకులు హిందువులేగా! ఈ దుస్థితికి బాధ్యులు హిందూ అధికారులేగా! ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వ విధానాల నుంచి లబ్ధి పొందుతున్న వారిలో ముస్లింలు ఎవరైనా ఉన్నారా ? ప్రభుత్వాన్ని ఆశ్రయించి కాంట్రాక్టులు సంపాదించి, అపరిమితమైన లాభాలు నొల్లుకునే వారిలో ఒక్క ముస్లిమూ లేడుగా! వీరి లాభాపేక్షకు బలైపోతున్నది వాస్తవానికి అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులే ఎక్కువ మంది. పరిస్థితి మెరుగు పడాలంటే సంస్కరణలు అవసరం అని నిపుణులనుకునే చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ సంస్కరణలు తీసుకురావడానికి ముస్లింలు అడ్డపడడం లేదు. ఓటర్ల జాబితాల సవరణల్లో మాయమవుతున్న వారిలోనూ అత్యధిక శాతం ముస్లింలే కనిపిస్తున్నారు. నిరుద్యోగ సమస్యనే తీసుకున్నా నిరుద్యోగుల్లో ఎక్కువ మంది హిందువులే. వీరందరూ కరడుగట్టిన జాతీయవాదులే అయి ఉండాలిగా. మోదీ భక్తులే కావాలిగా. నిరుద్యోగ సమస్యకు ముస్లింలు కారణం అని చెప్పే అవకాశమే లేదు. కుళాయిల్లో మురికినీరు వచ్చినా, మురికి కాలవలు పెరిగిపోయినా, విద్యుత్‌కోత ఎదురైనా ఆ కష్టాలు అనుభవించే వారిలో మళ్లీ హిందువులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ పరిపాలన భ్రష్టుపట్టి పోతుంటే గొంతెత్తే హిందువులు గుప్పెడు మంది కూడా కనిపించరు. అందులో మోదీ భక్తులు ఒక్కరు కూడా ఉండరు. మోదీ అమలుచేస్తున్న హిందూ ఎజెండా వల్ల జరిగిందల్లా హిందువులను భయపెట్టడం. ఆందోళనకు గురి చేయడం. హిందువులను భయపెట్టడంలో మోదీ అగ్రగణ్యుడు. ఇటీవల సోమ్‌నాథ్ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ “ముస్లింలను సంతృప్తిపరిచే శక్తులు ఇంకా ఉన్నాయి” అన్నారు. గత పదకొండేళ్ల కాలంలో అలాంటి వారిని మోదీ ఎందుకు కట్టడి చేయలేకపోయారు. లవ్ జిహాద్ అన్న బూటక ప్రచారంతో పాటు “రసాయనిక ఎరువుల జిహాద”, “కార్పొరేట్ జిహాద” లాంటి మాటలు వినిపిస్తున్నాయి. అంటే ప్రతి చోటా ముస్లిం బూతాన్ని చూపించే ప్రయత్నమే జరుగుతోంది. మోదీ పాలనలో హిందుత్వమే కొనసాగుతున్నా ముస్లింలు తదితర అల్పసంఖ్యాక వర్గాల వారితో పాటు బాధలు అనుభవిస్తున్న వారిలో అధిక సంఖ్యాకులు హిందువులే. మోదీ పాలనలో హిందువులకు ప్రత్యేకంగా దోచి పెట్టిందేమీ లేదు. కానీ వారి మెదళ్లలోకి హిందుత్వ విషం మాత్రం ఎక్కించగలిగారు. మూడో దఫా అధికారంలోకి వచ్చిన మోదీ హయాంలో మిగిలిందల్లా హిందుత్వ భజనే.


