ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన కార్యక్రమం


పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఎం, ఆర్ఎస్పి పార్టీలు, ప్రజా సంఘాలు వినూత్న కార్యక్రమం

విశాలాంధ్ర ధర్మవరం;;వామపక్ష రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా సిపిఎం ఆర్ఎస్పి పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కాలేజీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పెద్దన్న, సిపిఎం సీనియర్ నాయకులు ఎస్.హెచ్. భాష,వారు మాట్లాడుతూ, దేశంలో గ్యాస్ ఉత్పత్తిలో కృష్ణా-గోదావరి బేసిన్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇక్కడ ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు, చమురు సంపదలో రాష్ట్రానికి న్యాయమైన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్, చమురులో కనీసం 50 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రానికి చెందాల్సిన సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని, రాష్ట్రానికి తగిన వాటా లభిస్తే ప్రతి ఇంటికి పైప్‌లైన్ ద్వారా తక్కువ ధరకు గ్యాస్ సరఫరా చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల నిరంతర పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ధరలను తగ్గించడంతో పాటు రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎస్.హెచ్. భాష, సిపిఎం పట్టణ కార్యదర్శి శేషంపల్లి మారుతి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్,ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జె.వి. రమణ, సిఐటియు జిల్లా కార్యదర్శి బాబ్జాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, ఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు మంజుల నరేంద్ర, ట్రాన్స్‌పోర్ట్ రంగ నాయకులు ఎస్. రఫీ, ఆర్ఎస్పీ నాయకులు దాసరి నరసింహులు, శ్రీనివాసులు, రమణ, పీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు నందకిషోర్, పీఆర్ఎస్‌వైఎఫ్ జిల్లా కార్యదర్శి సాయినాథ్ రెడ్డి వామపక్ష పార్టీలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *