పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం


. ఇరాన్`ఇజ్రాయిల్ మధ్య భీకర దాడులు
. శాంతి ప్రయత్నాలకు విఘాతం
. ట్రంప్ సూచన పట్టించుకోని నెతన్యాహు

తెహ్రాన్/టెలఅవివ్: యుద్ధం ముగిసిందనుకున్న వేళ మళ్లీ మంటలు ఎగిసిపడ్డాయి. నిశ్శబ్దం వచ్చిందనుకున్న వేళ మళ్లీ సైరన్లు మోగాయి. సరిహద్దులు సద్దుమణిగాయనుకున్న వేళ మళ్లీ క్షిపణులు గాల్లోకి ఎగిరాయి. పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణతో కొంత శాంతి నెలకొన్నట్టు కనిపించినా… తాజాగా ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఇజ్రాయిల్, ఇరాన్ మాత్రమే కాక లెబనాన్, యెమెన్, ఇరాక్ వరకు ఈ ఉద్రిక్తతలు విస్తరించడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ఇరాన్… ఇజ్రాయిల్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయిల్‌పై తెహ్రాన్ నేరుగా క్షిపణులు ప్రయోగించడం ఇదే తొలిసారి. లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతికారంగానే తాము ఈ చర్యకు దిగినట్లు తెహ్రాన్ స్పష్టం చేసింది. ఇరాన్ దాడుýతో దేశంలోని అనేక ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఇరాన్ మొత్తం 11 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించింది. వాటన్నింటినీ గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు కూడా పంపించినట్లు పేర్కొంది. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించింది. మరోవైపు ఇరాన్ దాడులకు ప్రతిస్పందించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి వారించినట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ గుర్తుచేశారు. “ఇప్పటికే మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చర్చలకు రండి” అని ఇరాన్‌కు సూచించారు. మరోవైపు నెతన్యాహుని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ “వారి దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు. ఇజ్రాయిల్ ప్రతిదాడి చేయదని ఆశిస్తున్నా… ఒకవేళ నెతన్యాహు ఎదురుదాడి చేస్తే గత 47 ఏళ్ల నుంచి జరుగుతున్నదే కొనసాగుతుంది” అని పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఎంత వారిస్తున్నా.. ఇజ్రాయిల్ ఆయన మాటను లెక్కచేయలేదు. సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు మొదలుపెట్టాయి. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ వైమానిక దళం భారీ దాడులు చేపట్టాయి. తెహ్రాన్‌లో అనేకచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతోపాటు తబ్రిజ్, ఇస్ఫహాన్ తదితర నగరాలు కూడా పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇజ్రాయిల్ దాడులు మొదలుపెట్టడంతో ఇరాన్ గగనతలం మూసివేసింది. మరోవైపు ఖతార్, సిరియాలు ఇప్పటికే ఇరాన్ దాడుల కారణంగా గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయిల్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను వాడినట్లు ఇరాన్ ఆరోపించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అన్ని విమానాల రాకను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.

The post పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *