పేదల ఇంటి పట్టాలపై అక్రమాల ఆరోపణలు…


భూస్వాములకు కేటాయించిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి…

94వ సర్వేలో ఇచ్చిన పట్టాలపై సమగ్ర విచారణ జరపాలి

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : పేదలకు అందాల్సిన ఇంటి పట్టాలు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని, భూములు కలిగిన భూస్వాములకు సైతం ప్రభుత్వ ఇంటి స్థలాలు కేటాయించడం తీవ్రమైన అక్రమమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ నార్పల గ్రామ పరిధిలోని 94వ సర్వే నంబరులో గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇంటి పట్టాలు కేటాయించినప్పటికీ, అక్కడ ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు జరగలేదని తెలిపారు. స్థలం మొత్తం కంపచెట్లు, పొదలతో నిండిపోయి ఉండటమే కేటాయింపుల్లో జరిగిన లోపాలకు నిదర్శనమని పేర్కొన్నారు. నిజంగా నివాస స్థలం లేని పేదలకు పట్టాలు అందాయా లేదా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.అలాగే 11.4 లేఅవుట్‌లో ఇప్పటికే భూములు కలిగిన భూస్వాములకు సైతం ఇంటి పట్టాలు కేటాయించినట్లు ఆరోపించారు. పేదల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ భూములు ప్రభావశీలుల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమని, ఇలాంటి కేటాయింపులు సామాజిక న్యాయానికి విరుద్ధమని మండిపడ్డారు.అనర్హులకు ఇచ్చిన పట్టాలను వెంటనే రద్దు చేసి, నిజమైన నిరుపేదలు, గృహహీనులకు తిరిగి కేటాయించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సహాయ కార్యదర్శులు చాపల రామాంజి, సాకే సుధాకర్, రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ, సీనియర్ నాయకులు నాగరాజు, నారాయణప్ప, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *