వారాంతపు సెలవులు లేకుండా విధులు.. ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు…..
విశాలాంధ్ర – నార్పల(అనంతపురం జిల్లా): పెరుగుతున్న పని భారం, సెలవులు లేకుండా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ మండలంలోని వీఆర్వోలు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. విధుల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా వీఆర్వో శివరాం మాట్లాడుతూ, ఇటీవల కర్నూలు జిల్లాలో ఓ వీఆర్వో తీవ్ర పని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉద్యోగుల్లో ఆందోళన కలిగించిందన్నారు. అలాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పరిస్థితులను సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రెండో శనివారం, ఆదివారం వంటి వారాంతపు సెలవులు కూడా లేకుండా నిరంతరం విధులు నిర్వహించాల్సి వస్తోందని, 14 శాఖలకు సంబంధించిన పనులతో పాటు సచివాలయ ఉద్యోగుల బాధ్యతలను సైతం తమతో చేయిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పీజీఆర్ఎస్కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో పని భారం మరింత పెరిగిందన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ముందుగా ఉద్యోగులపై పడుతున్న అధిక పనిభారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీఆర్వోల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, అదనపు సిబ్బందిని నియమించడం లేదా పనిభారాన్ని పునర్విభజించడం ద్వారా ఉపశమనం కల్పించాలని కోరారు.పని ఒత్తిడిని తగ్గిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్వోలు తమ నిరసనను శాంతియుతంగా కొనసాగించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


