ఆ రెండు దేశాల ప్రయత్నాలకు అమెరికా అడ్డుకట్ట
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాక్, చైనా కుట్రలకు అమెరికా అడ్డుతగిలింది. ఐరాసలో ఆ రెండు దేశాలకు దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎలఏ), మజీద్ బ్రిగేడ్లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించేలా భద్రతా మండలిని ఒప్పించేందుకు ఇరుదేశాల ప్రయత్నాలను అమెరికా అడ్డుకుంది. పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌కు చెందిన ఆ రెండు బలోచ్ సంస్థలకూ అల్‌ఖైదాతో గానీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో కానీ సంబంధాలున్నాయని తెలిపే సాక్ష్యాలేవీ లేవని అమెరికా స్పష్టంచేసింది. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్లతో సంబంధాలున్నవారిపై మాత్రమే ఉగ్రముద్ర వేసి వారిపై ఆంక్షలు విధించే ఆనవాయితీని ఐరాస కొనసాగిస్తోంది. బీఎలఏ, మజీద్ బ్రిగేడ్లకు భారత్ సాయమందిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఆ రెంటినీ ఐరాస ఉగ్రసంస్థలుగా గుర్తిస్తే భారత్‌ను ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న దేశంగా ప్రచారం చేయవచ్చన్నది పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసీం మునీర్ ఎత్తుగడ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బలోచ్ సంస్థలను ఐరాస ఉగ్ర సంస్థలుగా గుర్తించేలా చేసేందుకు పాకిస్థాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే భారత్ ఈ విషయంలో ఫ్రాన్స్ మద్దతుతో అమెరికాపై ఒత్తిడి తెచ్చి పాక్, చైనాల ఎత్తుగడను తిప్పికొట్టిందని మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.


