ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు


విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్) శనివారం ఘనంగా ముగిశాయి. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు కొనసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ విద్యా, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి వై. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముగింపు సమావేశంలో పలువురు వక్తలు విద్యార్థులకు పుస్తకాల ప్రాముఖ్యత, పఠన సంస్కృతి అవసరాన్ని వివరించారు. గ్రంథాలయాధికారి మాట్లాడుతూ డిజిటల్ యుగంలోనూ పుస్తకాల విలువ ఏమాత్రం తగ్గలేదని, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సులభంగా సాధించగలరని పేర్కొన్నారు. పుస్తకాలు విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కూడా అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాలాక్షి మాట్లాడుతూ ప్రముఖులు చెప్పిన నిచినిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో” అనే సూక్తిని ప్రస్తావిస్తూ పుస్తకాల గొప్పతనాన్ని వివరించారు. పుస్తకం మనిషికి నిజమైన మిత్రుడని, జీవితంలో సరైన మార్గాన్ని చూపే గురువని పేర్కొన్నారు. నేటి చరిత్రను భావితరాలకు అందించే అద్భుత సాధనం పుస్తకమని, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించే శక్తి పుస్తకాలకు ఉందని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు సాహిత్య, విజ్ఞాన, చరిత్ర సంబంధిత పుస్తకాలను కూడా చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. వేసవి శిక్షణా తరగతుల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పుస్తక పఠనం, యోగా తదితర పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్, ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా గ్రంథాలయం చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *