విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, పశువుల హాస్పిటల్ పక్కన నిర్మించిన “జగనన్న బాలల ఆనంద వేదిక” పిల్లల పార్కులో శిధిలావస్థకు చేరుకున్న ఆట పరికరాలకు శనివారం మరమ్మత్తులు చేపట్టారు. దివంగత ఎన్ వెంకట రెడ్డి జ్ఞాపకార్థం, శ్రీరామదాసు పేపర్ బోర్డు సౌజన్యంతో కడియం పశువుల హాస్పిటల్ పక్కన, సుమారు ఐదు సంవత్సరాల క్రితం, బాధ్యత సేవా సంస్థ ఆధ్వర్యంలో, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పర్యవేక్షణలో ఈ పార్కును నిర్మించారు. అనంతరం పార్క్ నిర్వహణలో భాగంగా, కాలక్రమేణా ఆట వస్తువులు శిధిలావస్థకు చేరుకున్నాయి. పార్కుకు మరమ్మత్తుల నిర్వహించాలని కోరుతూ గతంలో విశాలాంధ్ర పత్రికలోనూ వార్త ప్రచురితమైంది. పార్కులో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, రామదాసు పేపర్ బోర్డ్ యాజమాన్యం దృష్టికి, గిరజాల బాబు పలుమార్లు తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన పేపర్ బోర్డ్ యాజమాన్యం హైదరాబాద్ నుండి నిపుణులను తీసుకువచ్చి మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరజాల బాబు మాట్లాడుతూ పిల్లల పార్కు శని మరియు ఆదివారాలలో అందుబాటులో ఉండదని, అందరూ సహకరించాలని కోరారు.


