మా ప్రభుత్వంలో పేపర్ లీకులు లేవు: కేజ్రీవాల్


న్యూదిల్లీ: తమ పార్టీ దిల్లీలో అధికారంలో ఉన్న పదేళ్లపాటు ఎటువంటి పేపర్ లీక్‌లు చోటుచేసుకోలేదని ఆప్ అధినేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ లీక్‌లు మొదలయ్యాయని ఆయన ఆక్షేపించారు. దేశంలో తరచూ తలెత్తుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలపై ఆయన మరోసారి మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీక్ వెనుక బిలియన్ల విలువ చేసే వ్యాపారాలు నడుస్తున్నాయని, ఇందులో చాలా పెద్ద వ్యక్తుల హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ప్రతి మూడేళ్లకు ఒకసారి పేపర్ లీక్‌లు ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఒక్క లీక్ కూడా జరగలేదన్నారు. పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో గతంలో తెలంగాణలో బ్యాన్ చేసిన కోఎంప్ట్ ( గ్లోబరీనా) కంపెనీకే కేంద్రం సీబీఎసఈ 12వ తరగతి ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎసఎం) విధానాన్ని కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆ కంపెనీ తెలంగాణలో సృష్టించిన సమస్యల వల్ల 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అటువంటి కంపెనీకి ఇంత పెద్ద సీబీఎసఈ కాంట్రాక్ట్‌ను ఇవ్వడం వెనుక కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని దేశ యువతకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. పేపర్ లీక్‌లను అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకునేలా విద్యార్థులు, పౌరులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానంత వరకు ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుందన్నారు. రేపటి తరం భవిష్యత్తు కోసం ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నీట్, సీబీఎసఈ పేపర్ వివాదాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *