ఖరీఫ్‌పై‘ఎల్ నినో’ కాటు


కుంచించుకుపోనున్న వర్షపాతం
. దీర్ఘకాలిక సగటు 92 శాతానికే పరిమితం?
. కరవు ముప్ప్పు 35 శాతం… ఆహార ఉత్పత్తిపై దెబ్బ
. వరి, పత్తి, మిరప, వేరుశనగ దిగుబడులు 30 శాతం తగ్గే ప్రమాదం
. యుద్ధప్రాతిపదికన జిల్లా స్థాయి ‘కంటింజెన్సీ’ వ్యూహాలు
. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

విశాలాంధ్ర-సచివాలయం : రాష్ట్ర వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన, కోట్లాది మంది రైతుల జీవనాధారమైన ఖరీఫ్ సాగు సీజన్ ముంగిట కరవు రక్కసి నీడలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రంగా కమ్ముకుంటున్నాయి. ప్రపంచ దేశాల వాతావరణ సమతుల్యతను సైతం అతలాకుతలం చేసే పసిఫిక్ మహాసముద్రపు వేడి గాలుల ‘ఎల్ నినో’ ప్రభావం ఈసారి భారతదేశంలో ఖరీఫ్ పంటలపై, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తీవ్రమైన పడగ విప్పనుందనే వాతావరణ నిపుణుల సంచలన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమయింది. రానున్న ఖరీఫ్‌లో వర్షపాతం ఊహించని విధంగా గణనీయంగా తగ్గే ప్రమాదం పొంచి ఉందని, తక్షణమే ‘జిల్లా స్థాయి ముందస్తు ప్రణాళికలు’ సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అత్యవసరంగా ఆదేశించింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం… నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 92 శాతానికి పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడటానికి ఏకంగా 35 శాతం అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు హెచ్చరిస్తుండటం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల శాఖను తీవ్ర ఆందోళనలో పడేసింది. మన రాష్ట్రంలో మొత్తం వార్షిక ఆహార ఉత్పత్తిలో 50 శాతానికి పైగా వాటా కేవలం ఒక్క ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. జూన్, జులై నెలల్లో విత్తనాలు నాటే పనులను అస్తవ్యస్తం చేయడమే కాకుండా, ఒకవేళ రుతుపవనాల ఆరంభంలో కురిసిన అరకొర వర్షాలకు రైతులు తొందరపడి విత్తనాలు నాటినప్పటికీ, ఆ తర్వాత 15-20 రోజుల పాటు సుదీర్ఘంగా పొడి వాతావరణం కొనసాగితే తొలి మొలకలు భూమిలోనే ఎండిపోయి పూర్తిగా వాడిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఎల్ నినో ముప్ప్పు కేవలం వర్షాలు తగ్గడంతోనే ఆగిపోకుండా నేలలో తేమ శాతం వేగంగా క్షీణించడం, భూగర్భ జలాలు ఊహించని రీతిలో అడుగంటిపోవడం, పొడి వాతావరణం పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పంటలపై విభిన్న రకాల వినాశకర పురుగుల దాడి, సరికొత్త తెగుళ్లు ఊహించని విధంగా పెరగడం వంటి త్రిముఖ దాడికి దారితీస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో ప్రధాన ఖరీఫ్ పంటలయిన వరి, వేరుశనగ, పత్తి, మిరప వంటి అధిక నీటి వినియోగం గల పంటల దిగుబడి ఏకంగా 10 నుంచి 30 శాతం వరకు పడిపోయే ప్రమాదం స్పష్టంగా పొంచి ఉంది. భౌగోళిక పరిస్థితుల రీత్యా మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఈ ఎల్ నినో ప్రభావానికి అత్యంత తీవ్రంగా గురయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, వైఎసఆర్ కడప, చిత్తూరు వంటి కరవు పీడిత జిల్లాల్లో భూగర్భ జలాల క్షీణత ఇప్పటికే ఆందోళనకర స్థాయికి చేరడంతో ఇక్కడి రైతాంగం భారీ పంట నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. ఈ తీవ్ర పరిస్థితిని అరికట్టేందుకు రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలను, కాలువల ద్వారా నీటి సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, అత్యంత జాగ్రత్తగా వినియోగించుకునేలా కఠినమైన ‘వాటర్ ఆడిటింగ’ నీటి యాజమాన్యాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.
పరిస్థితి చేతులు దాటకముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోని స్థానిక వాతావరణ పరిస్థితులకు, నేలల స్వభావానికి అనుగుణంగా విత్తన నిల్వలు, పంటల ప్రణాళికలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని కేంద్రం సూచించింది. సాంప్రదాయకంగా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, పత్తి వంటి పంటల స్థానంలో తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటలయిన పప్ప్పు దినుసులు (కందులు, పెసలు, మినుములు), కొన్ని రకాల చిరు ధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి మిల్లెట్స్) త్వరగా దిగుబడినిచ్చే అంతర పంటలు, కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే శరవేగంతో ప్రారంభించింది. ఇందులో భాగంగానే అనావృష్టిని, కరవును తట్టుకుని నిలబడే ప్రత్యేక వంగడాల విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు భారీగా నిల్వలను సమకూరుస్తూ, జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేస్తోంది. ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం రైతులు కూడా సాంప్రదాయ సాగు మొండితనాన్ని వీడి, నీటిని పొదుపుగా వాడుకుంటూ బిందు-సేద్యం (డ్రిప్), స్ప్రింక్లర్ పద్ధతులను ఆశ్రయించడం, ప్రత్యామ్నాయ ఆరుతడి సాగు దిశగా అడుగులు వేయడమే ఈ ‘ఎల్ నినో’ గండం నుంచి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

The post ఖరీఫ్‌పై‘ఎల్ నినో’ కాటు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *