ఈఏపీసెట్ ఫలితాలు జాప్యం!


ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తర్వాతే ర్యాంకులు

విశాలాంధ్రబ్యూరో – అమరావతి:ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) ఫలితాల విడుదల మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 1న ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ ఇంప్రూవ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కారణంగా ఫలితాల ప్రకటనను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశాన్ని కల్పించడంతో, వారి తాజా మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈఏపీసెట్ ర్యాంకులను ఖరారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే వరకు ఈఏపీసెట్ ఫలితాలను నిలిపివేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించినట్లు సమాచారం. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కొనసాగుతున్నందున, విద్యార్థులు సాధించిన తాజా మార్కులు తుది ర్యాంకులపై ప్రభావం చూపే అవకాశముంది. దీంతో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూసే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని మార్కుల తేడాతో వేల సంఖ్యలో ర్యాంకులు మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.తాజా అంచనాల ప్రకారం ఈఏపీసెట్ ఫలితాలు ఈనెల 18 తర్వాత విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5తో ముగియనున్నాయి. అనంతరం జవాబు పత్రాల మÖల్యాంకనం, మార్కుల సమీకరణ, డేటా ధృవీకరణ ప్రక్రియలు సుమారు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో సప్లిమెంటరీ ఫలితాలు జూన్ మÖడో వారంలో ప్రకటించే అవకాశం ఉండగా, అదే సమయంలో ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి. ఇందులో ఒక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకే దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్షలు రాయడం గమనార్హం. ఈ భారీ సంఖ్య కారణంగా మÖల్యాంకన ప్రక్రియ సమయం తీసుకునే అవకాశముంది. ఫలితాల విడుదలలో ఆలస్యం కారణంగా ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సంబంధిత శాఖలు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నాయి.

The post ఈఏపీసెట్ ఫలితాలు జాప్యం! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *