Last Updated:
యనమల రామకృష్ణుడు కుటుంబం ఏవినగరం ఆలయాలు, ఆస్తులు, బంగారం, పత్రాలను అధికారికంగా టీటీడీకి అప్పగించడంతో భక్తులకు విశ్వసనీయత, పారదర్శకత పెరిగింది.
ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ ఆధ్వర్యంలో స్థాపించబడిన దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులు, బంగారం, ముఖ్య పత్రాలను అధికారికంగా తిరుమల తిరుపతి దేవస్థానం కు ధారాదత్తం చేశారు. ఇకపై ఈ ఆలయాల్లో జరిగే నిత్యపూజలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్నాయి.
కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవినగరం గ్రామం యనమల స్వగ్రామం. అక్కడే దాదాపు పదేళ్ల క్రితం యనమల రామకృష్ణుడు, ఆయన సతీమణి విజయలక్ష్మి దంపతులు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్టించారు. ప్రధాన ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు నిర్మించి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రతిరోజూ నిత్యపూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపిస్తూ ఈ దివ్యక్షేత్రాన్ని ప్రజల్లో ప్రత్యేకంగా నిలిపారు.
ఈ ఆలయ ధర్మకర్తగా యనమల సోదరుడు నాగేశ్వరరావు వ్యవహరించగా, వ్యవస్థాపకులుగా యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య గోపీనాథ్ దంపతులు తదితరులు పర్యవేక్షణలో కార్యక్రమాలు కొనసాగాయి. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో టీటీడీకి అప్పగించాలని యనమల కుటుంబం నిర్ణయించింది.
ఈ సందర్భంగా దేవాలయాలకు సంబంధించిన ఆస్తి పత్రాలు, స్వామివారి నగలు, ఇతర ముఖ్య రికార్డులను టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈఓ బాలరాజుకు యనమల దంపతులు స్వయంగా అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని, అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. త్వరలోనే కొన్ని ఉద్యోగ నియామకాలు కూడా చేపడతామని తెలిపారు.
యనమల తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న ఆలయాలను టీటీడీకి అప్పగించడం ద్వారా భక్తులకు మరింత విశ్వసనీయత, పారదర్శకత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని యనమల వర్గాలు చెబుతున్నాయి. ఏవినగరం దివ్యక్షేత్రాలు ఇకపై టీటీడీ శాసనంలో మరింత వైభవంగా వెలుగొందనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


