అల్పాహార విందులో సిద్ధరామయ్య వెల్లడి
బెంగళూరు: కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నట్లుగానే నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో గురువారం ఉదయం జరిగిన అల్పాహార విందులో సిద్ధూ తన నిర్ణయాన్ని క్యాబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే… ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాత్ అందుబాటులో లేరు. కుటుంబపరమైన కారణాల రీత్యా బెంగళూరు వీడి వెళ్లారు. అయినప్పటికీ సీఎం రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సిద్ధూ ఆశీర్వాదం తీసుకున్న డీకే…
నాయకత్వ మార్పు వేళ… క్యాబినెట్ మంత్రుల కోసం సీఎం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన అల్పాహార విందు ఇందులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించారు. అనంతరం ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు తీసుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజా పరిణామాలతో డీకే సీఎం అవ్వడం ఖాయంగానే కన్పిస్తోంది. రాజీనామా అనంతరం హైకమాండ్ నుంచి శుభవార్త వస్తుందని డీకే వర్గీయులు భావిస్తున్నారు.
The post సీఎం పదవికి రాజీనామా appeared first on Visalaandhra.


