మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవతో జీవో విడుదల
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 32 రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.33 కోట్ల నిధులను మంజూరు చేస్తూ మంగళవారం ప్రత్యేక జీవో విడుదల చేసింది. వ్యవసాయ మరియు సహకార శాఖ 2026-27 బడ్జెట్ అంచనాల్లో భాగంగా ఈ నిధులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 452 విడుదల చేయగా, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైనప్పటికీ అసంపూర్తిగా నిలిచిపోయిన రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ నిధుల మంజూరు జరిగిందని సమాచారం. దీంతో ఉరవకొండ నియోజకవర్గంలోని 32 రైతు సేవ కేంద్రాల పనులు వేగవంతం కానున్నాయి. ఈ భవనాలు పూర్తికావడం ద్వారా రైతులకు వ్యవసాయ సేవలు, సలహాలు, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయని అధికారులు పేర్కొన్నారు.


