వాషింగ్టన్: ఇరాన్‌తో ఒప్పందం కోసం తామేమీ తొందరపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా అధికారులు చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేవరకు కొనసాగుతోందని వెల్లడించారు. వాస్తవానికి ఇరాన్-అమెరికా ఒప్పందం దిశగా ముందడుగు వేసినట్లు వార్తలు వస్తున్నా… అవి కుదిరేసరికి ఎన్నాళ్ల సమయం పడుతుందో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధం నాటి నుంచి 1,500-2,000 నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయి. తక్షణమే హోర్మూజ్‌ను తెరిచినా… అనేక కారణాలతో షిప్పింగ్ సాధారణస్థాయికి రావడానికి చాలా సమయం పడుతుందన్న అంచనాలున్నాయి. నౌకాయాన సంస్థలు ఈ ఒప్పందం స్థిరంగా ఉంటుందని తొలుత నమ్మాల్సి ఉంటుంది. జలసంధిలో అమర్చిన సీమైన్స్‌ను తొలగించడానికి ఎంతకాలం పడుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు మైన్ స్వీపింగ్ నౌకలను ఈ ప్రాంతంలో మోహరించేందుకే చాలా సమయం పట్టొచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. చమురు ఎగుమతి ఆపరేషన్లు స్థిరపడటానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు.
The post హోర్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది: ట్రంప్ appeared first on Visalaandhra.


