కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ముఖ్యంగా రాజధాని కీవ్ రీజియన్‌పై క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో శక్తిమంతమైన హైపర్ సోనిక్ ‘ఒరెష్నిక’ క్షిపణులను రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. బిలా సెర్క్వా నగరంపై ఆదివారం ఉదయం రష్యా జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందగా, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా రష్యా భారీ డ్రోన్, క్షిపణి దాడులకు తెగబడిందని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో హైపర్ సోనిక్ ‘ఒరెష్నిక’ క్షిపణులు ప్రయోగించడం ఇది మూడోసారి. అయితే, ఉక్రెయిన్ ఆరోపణలపై రష్యా ఇప్పటి వరకు స్పందించలేదు.


