శాంతి ఒప్పందం మరింత జాప్యం
తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నా… అవి ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీనికి కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖామేనీ అందుబాటులో లేకపోవడమేనని తెలుస్తోంది. మొజ్తాబా రహస్య ప్రాంతంలో ఉన్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం దూతల సాయంతోనే అధికారులు, నాయకులకు ఖామేనీ సందేశాలు పంపిస్తున్నాడని పేర్కొన్నాయి. ‘అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను మొజ్తాబా ఖామేనీ చూసినట్లు మాకు సమాచారం అందింది. అయితే, దానిపై ఆయన నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారులు కూడా ఖామేనీని నేరుగా సంప్రదించలేక పోతున్నారు. అందుకే చర్చలు ఆలస్యమవుతున్నాయి’ అని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. కాగా… ఖామేనీతో పాటు తెహ్రాన్‌కు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా వారాలతరబడి బంకర్లలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేరుగా మాట్లాడుకోవడం లేదని సమాచారం. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించిన తొలిరోజే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీని అంతమొందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలీ ఖామేనీ కుమారుడు మొజ్తాబాను సుప్రీం నేతగా ఎన్నుకున్నారు. అయితే, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చాలాసార్లు వార్తలు రాగా… వాటిని ఇరాన్ తోసిపుచ్చింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపింది. అయితే, ఇప్పటివరకు మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు, మాట్లాడలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఖామేనీ హోదాలో ఎవరున్నా వారు తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయిల్ పదేపదే హెచ్చరికలు పంపుతోంది. ఈ పరిణామాల వేళ మొజ్తాబా రహస్య ప్రాంతంలో ఉన్నట్లు వార్తలు ప్రాధాన్యం సంతరించుకుంది.


