హెరిటేజ్‌ ఫుడ్స్‌తో ఇందాపూర్ డైరీకి ఉన్న లింక్ ఏంటి?.. కల్తీ నెయ్యికి హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులను ఇందాపూర్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ, నెయ్యి సరఫరాలో మాత్రం అలాంటి సంబంధం లేదని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అయితే, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి…

Rapid Read
Is There Any Link Between Heritage Foods and Indapur Dairy  AP Government Clarifies
Is There Any Link Between Heritage Foods and Indapur Dairy AP Government Clarifies

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఇందాపూర్ డెయిరీ సంస్థకు హెరిటేజ్ ఫుడ్స్ తో ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఇందాపూర్ పెద్ద సంస్థ కాగా, హెరిటేజ్ దానికంటే చిన్నదని మంత్రి పేర్కొన్నారు.

సంస్థల మధ్య సంబంధాలపై వస్తున్న ఆరోపణలకు ఆధారం లేదని మంత్రి తెలిపారు. సాధారణంగా చిన్న సంస్థలు పెద్ద సంస్థల యూనిట్లుగా పనిచేయడం జరుగుతుందని, కానీ పెద్ద సంస్థ ఒక చిన్న సంస్థకు అనుబంధంగా ఉండటం సహజం కాదని వివరించారు. పాలు సేకరణ పరిమాణాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయని చెప్పారు. హెరిటేజ్ రోజుకు సుమారు 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తే, ఇందాపూర్ డెయిరీ దాదాపు 40 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుందని తెలిపారు. ఈ లెక్కల ప్రకారం ఇందాపూర్ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇరు సంస్థల వ్యాపార విధానాలూ భిన్నమని కూడా మంత్రి వెల్లడించారు. ఇందాపూర్ డెయిరీ ప్రధానంగా బల్క్ మార్కెటింగ్‌లో పనిచేస్తుండగా, వినియోగదారుల మార్కెట్‌కు సరఫరా చేసే చిన్న కంపెనీలు అక్కడి నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తాయని చెప్పారు. హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులను ఇందాపూర్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ, నెయ్యి సరఫరాలో మాత్రం అలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్‌కు స్వంత నెయ్యి తయారీ యూనిట్ ఉండటంతో, అది వినియోగదారుల మార్కెట్‌పైనే దృష్టి పెడుతుందని, బల్క్ ట్యాంకర్ల ద్వారా నెయ్యి రవాణా చేసిన దాఖలాలు లేవని తెలిపారు.

ఇక ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతంలో తక్కువ ధరకు విక్రయించిన నెయ్యి ఇప్పుడు అధిక ధరలకు అమ్ముతున్నారని, కొన్ని వ్యవహారాలు అధికార కాలంలోనే ప్రారంభమయ్యాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలు నెయ్యి సరఫరా అంశంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఇదే సమయంలో మీడియా కథనాలపై కూడా వివాదం మరింత వేడెక్కింది. సాక్షి మీడియా ప్రచురించిన కథనాలపై హెరిటేజ్ సంస్థ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు దృష్టికి వెళ్లగా, సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలు, వీడియో లింక్‌లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. సంబంధిత ప్రచారాలను నిలిపివేయాలని కూడా స్పష్టం చేసింది.

ఈ పరిణామాలన్నీ చూస్తే ఏపీ రాజకీయాలు మరింత హీట్ పెరిగేలా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇరు సంస్థల మధ్య యాజమాన్య సంబంధం లేదని తేల్చి చెబుతోంది. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *