అపరిచిత వ్యక్తుల పరిచయాలతో అనర్ధాలు – Visalaandhra


సోషల్ మీడియా వేదికగా అనేక మోసాలు
విశాలాంధ్ర: అవసరానికి మించి దేన్నీ వినియోగించరాదు. అతి అనర్ధాలకు దారితీస్తుంది. ఇవన్నీ సామెతల్లా అనిపించవచ్చు. కానీ నిశిత పరిశీలన చేస్తే జీవిత సత్యాలుగా కనిపిస్తాయి. ఇప్ప్పుడు సోషల్ మీడియా పరిస్థితి అలా ఉంది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పరిచయాలు అనర్ధాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఇటీవల జరిగిన సంఘన…అనంతపురం నగరంలో ఓ యువతి చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అనుకోకుండా ఓరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అపరిచిత అబ్బాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని అంగీకరించింది. ఇలా చాటింగ్‌ల్లో ఒకరికొకరు దగ్గరయ్యారు. అవతలి వ్యక్తి తీపి మాటలకు నమ్మి మోసగాడి ఆధీనంలోకి వెళ్లింది. అతడు చెప్పిందల్లా చేసింది. అవసరమైనప్ప్పుడల్లా యువతితో డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. ఇలా రూ.9 లక్షలు పంపించింది. ఆ మోసగాడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. యువతి నిలదీసి తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులు, మహిళలను ఊహించని ప్రమాదాల్లో నెట్టేస్తున్నాయి. ఈ మధ్య ఇటువంటి ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
మహిళలారా మోసపోకండి…
సోషల్ మీడియా పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు అనర్ధాలకు దారితీస్తున్నాయి. అందమైన యువకుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని నేరగాళ్లు నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. కొందరు గుడ్డిగా నమ్మి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, విషయాలను పంచుకుంటున్నారు. అలా పంపగానే వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారు. పరువు పోతుందనే భయంతో ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ క్షోభను అనుభవిస్తున్నారు. కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వయసొచ్చిన పిల్లలు ఎవరితోనైనా పరిచయాలు పెంచుకుంటున్నారా? ఛాటింగ్ చేస్తున్నారా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిత్యం ఫోన్ పట్టుకుని కాలక్షేపం చేసే అబ్బాయిలు, అమ్మాయిల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *