Heavy Rain: ఉదయం ఉక్కపోత.. సాయంత్రం ఊచకోత.. విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్, విద్యుత్ నిలిపివేత, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక

News18
News18

విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మండిపడిన ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రానికి వరుణుడు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిపోయిన నగరం.. సాయంత్రం కాగానే నల్లని మేఘాలతో కమ్ముకుంది. కొద్ది సేపటికే ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా నగరాన్ని ముంచెత్తింది.

ఆర్కే బీచ్, జగదాంబ జంక్షన్, సీతమ్మధార, గాజువాక, ద్వారకానగర్, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, సిహాచలం, గోపాలపట్నం సహా పలు ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొద్ది నిమిషాల వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ నెమ్మదించింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇంటికి బయలుదేరిన ప్రజలు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

మరోవైపు భారీ ఈదురుగాలులు నగరాన్ని వణికించాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడగా.. కొన్ని ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఊగిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వర్షం ఒకవైపు ఉపశమనం ఇచ్చినా.. మరోవైపు కరెంటు కోతలతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. కేవలం విశాఖలోనే కాకుండా.. విజయనగరం జిల్లాలో కూడా భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, భరించలేని ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఈ వర్షం మాత్రం కాస్త ఊరటనిచ్చింది. వర్షం ప్రారంభం కాగానే చాలా మంది ఆనందంగా వర్షాన్ని ఆస్వాదించారు. ఆర్కే బీచ్ ప్రాంతంలో సముద్ర తీరానికి వచ్చిన యువత, కుటుంబాలు చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. పిల్లలు వర్షంలో తడుస్తూ సందడి చేయగా.. వేడి వాతావరణం నుంచి తాత్కాలిక ఉపశమనం లభించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే వాతావరణ శాఖ మరిన్ని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురుగాలుల కారణంగా చెట్ల కింద నిలబడకూడదని, అత్యవసరం లేకపోతే బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం విశాఖ నగరానికి చల్లని ఉపశమనం ఇచ్చినా.. ట్రాఫిక్, విద్యుత్ సమస్యలతో నగరవాసులను కొంతసేపు ఇబ్బందులకు గురిచేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *