మండిపోతున్న ఆంధ్రప్రదేశ్.. 15 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..! Andhra Pradesh heat wave | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


వచ్చే బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మే 23 శనివారం పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

మరోవైపు ద్రోణి ప్రభావంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడవద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు వర్ష సూచనలతో రాష్ట్రంలో వాతావరణం అస్థిరంగా మారుతోంది.

ఇక ఆదివారం కూడా రాష్ట్రంలో వేడి తీవ్రంగానే ఉండనుంది. పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తరచూ మంచినీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని, బయటకు వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ కట్టుకోవడం, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *