Last Updated:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తల్లిదండ్రులు లేని ఇద్దరు చిన్నారులకు నెలకు రూ.5000 సహాయం, పెన్షన్, శ్రీ శక్తి పథకం లబ్ధి కల్పించేందుకు హామీ ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలో ఉన్నవారికి అండగా నిలుస్తూ డిప్యూటీ సీఎం Pawan Kalyan మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా దిక్కులేని చిన్నారులు, పేద కుటుంబాల సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటున్న పవన్ కళ్యాణ్, తాజాగా పిఠాపురంలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటనపై చలించిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన ఇద్దరు చిన్నారులకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి వారి భవిష్యత్తుకు అండగా నిలిచారు.
పిఠాపురం నియోజకవర్గంలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులు లేక దూరపు బంధువైన ఓ మహిళ వద్ద ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆ మహిళ జీవితమూ అంత సులభం కాదు. భర్త లేకపోవడంతో ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలతో పాటు ఈ ఇద్దరు అనాథ చిన్నారులను కూడా ఎంతో కష్టపడి పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. రోజువారీ ఆదాయంతో నలుగురు పిల్లల బాధ్యతలు భరించడం ఆమెకు భారంగా మారినా పిల్లలను విడిచిపెట్టకుండా తల్లిలా చూసుకుంటూ ఆదర్శంగా నిలిచింది.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. చిన్నారుల పరిస్థితి తెలుసుకుని ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ పట్టణ ఇన్‌చార్జ్ చిక్కాల వరలక్ష్మి, వీర మహిళలు ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. ఆటో నడుపుతూ నలుగురు పిల్లలను పోషిస్తున్న ఆ మహిళ సేవాభావాన్ని ప్రశంసిస్తూ ఆమెను ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రతినెలా రూ.5000 ఆర్థిక సహాయం అందజేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఆ కుటుంబానికి ఊరటనిచ్చింది. అలాగే మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న బాలికకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో నడిపే మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీ శక్తి పథకం ద్వారా కూడా ఆమెకు లబ్ధి చేకూరేలా చూస్తామని తెలిపారు.
ఒక్కసారిగా తమకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్, జనసేన వీర మహిళలకు ఆ కుటుంబ సభ్యులు కన్నీటి కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మాకు భరోసా ఇచ్చారు.. ఈ సహాయం జీవితాంతం మర్చిపోలేం అంటూ చిన్నారులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనతో మరోసారి పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే మనిషిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను మరింత ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


