Bird Flu Case: చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు?.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Bird flu alert in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని సూచిస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో విదేశీ వలస పక్షులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.

Rapid Read
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Bird Flu: చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని సూచిస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో విదేశీ వలస పక్షులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ వలస పక్షుల ద్వారా ఇతర పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా మనుషులకు కూడా వైరస్ సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రమిత పక్షులను నేరుగా తాకడం ప్రమాదకరం.

వైరస్ సోకిన కోళ్లు లేదా పక్షుల మాంసాన్ని పూర్తిగా ఉడికించకుండా తినడం వల్ల కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చు. అయితే అధిక ఉష్ణోగ్రతల వద్ద వైరస్ జీవించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అందువల్ల మాంసాన్ని బాగా ఉడికించి తీసుకుంటే ప్రమాదం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.మనుషులకు వైరస్ సోకినట్లయితే సాధారణ ఫ్లూ లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి కొవిడ్ లక్షణాలకు సమానంగా ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం.

వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు గ్రిల్ చికెన్ లేదా సరిగా ఉడకని కోడిగుడ్లు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బాడీబిల్డింగ్ చేసే వారు ఎక్కువగా తీసుకునే ఆఫ్ బాయిల్ గుడ్లు ప్రమాదకరమవుతాయని చెబుతున్నారు. సురక్షిత ఆహార అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. ఉమ్మడి జిల్లాలో ముందస్తు చర్యలుగా మూడు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సదుం, కార్వేటినగరం, చిత్తూరు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కోళ్ల ఫారాల్లో పనిచేసినవారు లేదా సంక్రమిత పక్షులతో సంబంధం ఉన్నవారిని పది రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు.

ఇప్పటివరకు పరీక్షించిన 30 మందికిపైగా వ్యక్తుల నివేదికలు నెగిటివ్‌గా వచ్చినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఆరు పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసి అవసరమైన ఔషధాలను నిల్వ ఉంచారు. ముందు జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇటీవల కోళ్ల మరణాలు సంభవించిన ప్రాంతం నుంచి నమూనాలను ప్రయోగశాలకు పంపిన సిబ్బందిలో ఒకరికి జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో ఆయన్ను క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పక్షులను తాకకుండా, శుభ్రత పాటిస్తూ ఆరోగ్య సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *