Goa Beach: ఇక గోవా ట్రిప్స్ మర్చిపోండి.. ఏపీలోనే గోవా బీచ్ రెడీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Goa Beach: గోవా తరహా బీచ్ అనుభూతిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేయాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

News18
News18

ప్రస్తుతం యువతలో గోవా ట్రిప్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. బీచ్‌లు, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో యువత గోవాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అదే తరహా అంతర్జాతీయ స్థాయి వసతులను సూర్యలంకలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీచ్ ఫ్రంట్ రోడ్లు, రిసార్ట్స్, కేఫేలు, నైట్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, వాటర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటి అనేక ఆకర్షణలు అందుబాటులోకి రానున్నాయి. గోవా తరహా బీచ్ అనుభూతిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేయాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇకపై గోవా వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అంతకంటే మెరుగైన బీచ్ టూరిజం అనుభూతిని సూర్యలంకలోనే అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ‘బాపట్ల మాస్టర్ ప్లాన్’ త్వరలో సిద్ధం కానుంది.

సూర్యలంక బీచ్ ఇప్పటికే స్వచ్ఛమైన తీర ప్రాంతంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశాలమైన సముద్ర తీరంతో పాటు ప్రశాంత వాతావరణం ఈ బీచ్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి పనులతో ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే యువత, ఫ్యామిలీ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక డిజైన్‌తో ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. హోటల్స్, రిసార్ట్స్, ట్రావెల్, ఫుడ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బాపట్ల జిల్లా ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరిగితే తీర ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

సూర్యలంక బీచ్‌ను ‘గోవా ప్లస్’గా తీర్చిదిద్దే ప్రభుత్వ ప్రణాళిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గోవాకు వెళ్లాలనుకునే యువతకు ఇకపై సూర్యలంకే బెస్ట్ డెస్టినేషన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. అద్భుతమైన బీచ్ వ్యూస్, ఆధునిక వసతులు, నైట్ లైఫ్, టూరిజం ఆకర్షణలతో సూర్యలంక త్వరలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెట్టుబడుల సాధన, ప్రాజెక్టుల పురోగతిపై మంత్రుల కమిటీతో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సూర్యలంకతో పాటు నెల్లూరు మైపాడు వంటి తీరప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. బాపట్ల బీచ్ రూపురేఖలను పూర్తిగా మార్చేసేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, పర్యాటకులను ఆకర్షించేలా వినూత్న మల్టీపర్పస్ భవనాల నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో పర్యాటకంతో పాటు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు కాలపరిమితిని విధించారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి కావాలని, డిసెంబర్ 2028 చివరినాటికి ఇవన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రుల కమిటీకి, అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రాష్ట్రం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ఆచరణలో చూపాలని, పెట్టుబడిదారులకు సింగిల్ పోర్టల్ ద్వారా వేగంగా సేవలు అందించాలని ఆదేశించారు. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రంలోని 21 ప్రధాన ఆలయాలను కలుపుతూ ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్టును కూడా వేగంగా అడుగులు వేయించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *