విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో కార్పొరేట్ ఆప్టికల్ చైన్ లెన్స్ కార్ట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం పై స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఈ నిరసనలో పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలు ఐక్యంగా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. అదేవిధంగా వీరి నిరసన కార్యక్రమానికి రాష్ట్ర బీసీ మహిళ అధ్యక్షురాలు, సంకారపు జయ శ్రీ, వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవికుమార్, కోటి వెంకటేష్, కిరాణా వ్యాపారస్తులు, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షుడు కుళ్లాయప్ప, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్, ఆర్ఎస్పి పార్టీ నాయకులు మంజుల నరేంద్ర, వామపక్ష నాయకులు సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని స్థానిక వ్యాపారులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘీభావం తెలిపిన వారు మాట్లాడుతూ స్థానిక ఆప్టికల్ వ్యాపారులు ధర్మవరంలో 200 కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, అలాగే ఉద్యోగులు టెక్నీషియన్లు ఇతర అనుబంధ రంగాల వారితో కలిపితే 2000 మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో పెద్ద కార్పొరేట్ సంస్థ ప్రవేశిస్తే చిన్న వ్యాపారాలు నిలబడలేక మూతపడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా చిన్న ఆప్టికల్స్ దుకాణాల ఆదాయంతోనే మా పిల్లల చదువులు కుటుంబాల జీవనం కొనసాగుతోందని తెలిపారు. అభివృద్ధి పేరుతో చిన్న వ్యాపారాలను నాశనం చేయడం సమంజసం కాదని, ప్రజా ప్రతినిధులకు ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత స్థానిక ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై అధికారులపై ఉందని వారు స్పష్టం చేశారు. కావున తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో లెన్స్ కార్టు ధర్మవరంలోకి రావాలని ప్రయత్నిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం మా నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన అందరికీ కూడా వారు పేరుపేరునా అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్టికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సురేష్, శ్రీకాంత్ రెడ్డి ,హరికృష్ణ, శివా, ఆసీఫ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


