ఢిల్లీలో హై అలర్ట్ మీటింగ్.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై మోదీ సమీక్ష


పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుండగా, ఈ సమయంలో కేంద్ర మంత్రులందరూ జాతీయ రాజధానిలోనే ఉండాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు..
ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై ఎలాంటి ఆర్థిక ప్రభావం చూపవచ్చనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య చమురు ధరలు, ఇంధన సరఫరా వ్యవస్థ, ద్రవ్యోల్బణ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిశితంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ ఆసియా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి అనౌపచారిక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ బృందానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు.

త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు..
భారత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ బృందం సూచనలు ఇస్తోంది.
పరిస్థితిని ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షిస్తోందని ఇటీవల రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ముడి చమురు, ఇంధనం, ఎల్పీజీ నిల్వలు ప్రస్తుతం తగినంతగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత కూడా పెరిగింది. మోదీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణతో పాటు మంత్రివర్గ మార్పులు ఉండొచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. గత వారం నుంచే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు వేగం పుంజుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. జూన్ రెండో వారంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *