Last Updated:
ATM Fraud: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏటీఎం క్యాష్ ట్రాప్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, అనుమానం ఉంటే వెంటనే బ్యాంక్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన
ఇటీవల దేశ వ్యాప్తంగా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని నయా మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ తుషార్ డూడి లోకల్ 18 ద్వారా తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో వెలుగుచూసిన “క్యాష్ ట్రాప్” మోసాల తరహా ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మోసగాళ్లు ఏటీఎంలలో నగదు బయటకు వచ్చే స్లాట్ లోపల కనిపించకుండా ప్లాస్టిక్ ఫైబర్ లేదా ప్రత్యేక కార్డులను అమర్చి, ఖాతాదారులు డబ్బు డ్రా చేసిన తర్వాత నగదు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
లావాదేవీ విజయవంతమైందని స్క్రీన్‌పై చూపించినప్పటికీ, డబ్బు చేతికి అందకపోవడంతో చాలామంది సాంకేతిక లోపమని భావించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని, ఆ తర్వాత ముఠా సభ్యులు వచ్చి స్లాట్‌లో ఇరుక్కుపోయిన నగదును దోచుకుంటున్నారని వివరించారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిపారు.
ప్రజలు ఏటీఎంలో డబ్బు డ్రా చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు ముఖ్య సూచనలు ఏటీఎంలోకి వెళ్లినప్పుడు కార్డు స్లాట్ లేదా నగదు బయటకు వచ్చే భాగంలో ఏదైనా అదనపు వస్తువు, ప్లాస్టిక్ లేదా ఫైబర్ అమర్చినట్లు అనిపిస్తే వెంటనే ఆ ఏటీఎంను వినియోగించవద్దన్నారు. పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో తప్పనిసరిగా చేతితో కప్పి ఉంచండన్నారు.
ఏటీఎం లావాదేవీ విజయవంతమైందని చూపించినా నగదు రాకపోతే అక్కడి నుంచి వెళ్లిపోకుండా వెంటనే బ్యాంక్ హెల్ప్‌లైన్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండన్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఏటీఎం పరిసరాల్లో కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయండన్నారు. ఏదైనా మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంకును సంప్రదించి కార్డును బ్లాక్ చేయడంతో పాటు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని, అనుమానాస్పద ఘటనలపై వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



