రూ.1 కోటి విలువైన 500 మొబైల్స్ రికవరీ.. తిరుపతి పోలీసుల భారీ మొబైల్ రికవరీ మేళా! Tirupati police mobile recovery | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

తిరుపతి జిల్లా పోలీసులు 14వ దశ మొబైల్ రికవరీ మేళాలో రూ.1 కోటి విలువైన 500 ఫోన్లు బాధితులకు ఇచ్చారు, CEIR ద్వారా ఫిర్యాదులు, భద్రత సూచనలు ఇచ్చారు

News18
News18

మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అలాంటి ఫోన్ పోగొట్టుకుంటే అందులోని డేటా, బ్యాంకింగ్ యాప్స్, వ్యక్తిగత సమాచారం కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, తిరుపతి జిల్లా పోలీసులు అలాంటి బాధితులకు పెద్ద ఊరట కల్పిస్తున్నారు. పోయిన మొబైల్స్‌ను ట్రాక్ చేసి యజమానుల చేతికి అందిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు.

తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో 14వ దశలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ యల్. సుబ్బరాయుడు ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన 13 దశల్లో మొత్తం రూ.10 కోట్ల 52 లక్షల 70 వేల విలువైన 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన సాధనంగా మారిందన్నారు. ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా, ఇంటి నుంచే CEIR సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. దీనివల్ల ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతున్నాయని తెలిపారు.

తిరుపతి జిల్లా పోలీసులు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు CEIR సేవలను సులభంగా పొందేందుకు 9490617873 వాట్సాప్ నంబర్‌కు Hi అని మెసేజ్ పంపితే వెంటనే CEIR లింక్ అందుతుందని తెలిపారు. ఆ లింక్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసే విధానం నుంచి అవసరమైన సాంకేతిక సహాయం వరకు పూర్తి మార్గదర్శకత్వం అందిస్తున్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన CEIR పోర్టల్ ద్వారా పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ఫోన్ వినియోగాన్ని నిలిపివేయవచ్చని అధికారులు వివరించారు. దీంతో ఫోన్ ట్రాకింగ్ సులభమవుతుందని, మొబైల్ తిరిగి లభించిన తర్వాత అదే పోర్టల్ ద్వారా అన్‌బ్లాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ప్రజలు మొబైల్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేయించుకోవడం, PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం, వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం తప్పనిసరి అని హెచ్చరించారు. అపరిచితుల నుంచి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయకూడదని, అలాంటి ఫోన్లు భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉందన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి సైబర్ క్రైమ్ విభాగం సి.ఐ ఆర్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మొబైల్ ట్రాకింగ్, రికవరీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరావు, సైబర్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *