ఏపీలోని సముద్ర తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల చేపల వేట నిషేధం (ఫిషింగ్ బ్యాన్) ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులు ఆదాయం కోల్పోతారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు గతంలో రూ.10,000 ఉన్న సాయాన్ని రెట్టింపు చేసి రూ.20,000 చొప్పున అందజేస్తోంది. గత సంవత్సరం సుమారు 1.3 లక్షల కుటుంబాలు ఈ లబ్ధి పొందాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని న్యూస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.
చేపల వేటను నిషేధించిన సమయంలో.. సముద్రంలో చేపల సంఖ్య పెరుగుతుంది. వాటి సైజ్ పెరుగుతుంది. దాని వల్ల తిరిగి వేట మొదలుపెట్టినప్పుడు వలల్లో పెద్ద చేపలు దక్కుతాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ సాయం ద్వారా వారు కొంతవరకూ జీవనం సాగించగలరు. మెరుగైన పరికరాలు కొనుక్కోవడం, బోట్లను రిపేర్ చేసుకోవడం వంటివి చెయ్యగలరు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఒకటి. ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా హామీని నిలబెడుతోంది. ఈ కార్యక్రమం మత్స్యకారుల సంక్షేమానికీ, సముద్ర సంరక్షణకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
మనీ అకౌంట్లలోకి డైరెక్టుగా వస్తుందా?
అవును. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో DBT ద్వారా నేరుగా జమ అవుతుంది. మధ్యవర్తులు లేకుండా ప్రత్యక్షంగా అందేలా ఏర్పాట్లు చేశారు. ఐతే.. బ్యాంక్ అకౌంట్‌కి తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు సక్రమంగా అధికారులకు ఇచ్చి ఉండాలి. గతంలో కూడా ఇదే విధంగా అమలు చేశారు. నేటి కార్యక్రమంలో సీఎం స్వయంగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్హులైన వారి ఖాతాల్లో త్వరగా జమ కావాలని అధికారులు చెబుతున్నారు.
1. స్టేటస్ చెక్ చేయండి: ఆధార్ నంబర్‌తో egsws.ap.gov.in లేదా సంబంధిత పోర్టల్‌లో చెక్ చేయండి. లేదా స్థానిక గ్రామ/వార్డు సచివాలయం, మత్స్యశాఖ అధికారులను సంప్రదించండి.
2. అర్హత ఉంటే అభ్యంతరం సమర్పించండి: జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు అభ్యంతరాలు చెప్పవచ్చు. ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్, ఫిషర్మెన్ ID, బోట్ రిజిస్ట్రేషన్ వంటివి అప్డేట్ చేయాలి. ఆ వివరాల్ని సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలి.
3. అర్హత ప్రమాణాలు: మత్య్సకారుడి వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. నమోదైన ఫిషింగ్ బోట్/లైసెన్స్ ఉండాలి. ఇతర పెన్షన్ స్కీములు (NTR భరోసా) వంటివి కలిగిన లబ్ధిదారులు దీనికి అనర్హులు. కుటుంబ ఆదాయం పరిమితి చూస్తే గ్రామాల్లో సంవత్సరానికి రూ.1.20 లక్షలు లోపు ఉండాలి. పట్టణాల్లో సంవత్సరానికి రూ.1.44 లక్షలు లోపు ఉండాలి. రేషన్ కార్డు లింక్ ఉపయోగపడుతుంది.
4. సహాయం: స్థానిక మత్స్యశాఖ కార్యాలయం లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి. మధ్యవర్తులు/మోసాలకు లొంగకండి. ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు మత్స్యకారులకు అందనున్నాయి. సీఎం చంద్రబాబు నేటి పర్యటన ద్వారా మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని, అదనపు సహాయాలు ప్రకటించే అవకాశం ఉంది. గతంలో శ్రీకాకుళం ఎచ్చెర్లలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. తుమ్మలపెంటలోని ఈ కార్యక్రమం స్థానిక మత్స్యకారులకు పండుగగా మారనుంది.
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందనీ, ఫిషింగ్ హార్బర్లు, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మత్స్యకారులు నిషేధం నిబంధనలు పాటించి, పథకాల లబ్ధి పొందాలని సూచించారు. ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవు. ఎలాంటి సందేహాలున్నా స్థానిక సచివాలయ ఉద్యోగులను కలవండి.


