Poonam Kaur: మంత్రి లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్ ! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ విధానాన్ని ముందుగా ఆయన కుమారుడు నారా లోకేష్‌తో మొదలుపెట్టాలని ఆమె కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగతంగా చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం నిరాశ కలిగించిందని ఆమె పేర్కొన్నారు.

News18
News18

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన ఈ కొత్త విధానం గురించి వెల్లడించారు. గతంలో కుటుంబ నియంత్రణ పాటించాలని, తక్కువ మంది పిల్లలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన నాయకులే, ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు ఏమాత్రం భారం కాదని, భవిష్యత్తులో వారు మనకు ఆస్తులు లాంటి వారని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో యువత సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో జనాభా వృద్ధిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. అందులో భాగంగా ముగ్గురు పిల్లలు ఉంటే రూ.30 వేలు, అలాగే నలుగురు పిల్లలు ఉంటే రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

poonam kaur on nara lokesh

ఐతే, ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ కొత్త జనాభా పెంపు విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సోషల్ మీడియా వేదికగా సీఎం వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతున్న ప్రభుత్వం.. ఆ పిల్లలకు పాతికేళ్లు రాగానే కచ్చితంగా ఉద్యోగాలు ఇస్తుందా ? అని ప్రశ్నించారు. పుట్టే పిల్లల చదువు, ఆహారం, ఆసుపత్రి ఖర్చులు, ఇతర అవసరాలను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందా అని ఆమె నిలదీశారు.

రేణుకా చౌదరి చేసిన ఈ ట్వీట్‌పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ వెంటనే స్పందించారు. “ముందుగా ఈ విధానాన్ని లోకేష్‌తో మొదలుపెట్టండి” అని ఆమె బదులిచ్చారు. ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ముందుగా చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌ను ప్రోత్సహించాలని ఆమె కౌంటర్ ఇచ్చారు.

అదే సమయంలో చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని పూనమ్ కౌర్ వివరణ ఇచ్చారు. తన పాఠశాల రోజుల్లో ఆయన చేతుల మీదుగా బంగారు పతకం తీసుకున్నానని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ, ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం తనకు ఎంతో ఆశ్చర్యం, నిరాశ కలిగించాయని ఆమె చెప్పారు. అయితే, ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక విధానాన్ని విమర్శించడం వేరు, ఒక వ్యక్తిని విమర్శించడం వేరు అని ఆమె స్పష్టం చేశారు. ఈ విధానాన్ని తాను వ్యతిరేకించినంత మాత్రాన చంద్రబాబుపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గదని ఆమె వివరించారు.

పూనమ్ కౌర్ ఎప్పటినుంచో చంద్రబాబుకు మద్దతుదారుగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తూ నెట్టింట పెద్ద చర్చే చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *