Chittoor: ఖాకీల దొంగాట.. దొంగల ముఠాతో చేతులు కలిపి తమిళనాడు వ్యాపారిని దోచుకున్న ఏఎస్ఐ, కానిస్టేబుల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

గంగాధరనెల్లూరు సీఐ ప్రసాద్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిర్వాహకులతో పాటు చిత్తూరుకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Chittoor: రక్షకభటులే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే స్వయంగా దొంగలతో చేతులు కలిపారు. ఈజీ మనీ (సులభంగా డబ్బు సంపాదించడం)కి అలవాటుపడి, తోటి దొంగల ముఠాతో పక్కా స్కెచ్ వేసి ఓ అంతర్రాష్ట్ర వ్యాపారిని బెదిరించి రూ. 10 లక్షల నగదును దోచుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలో కలకలం రేపిన ఈ “దొంగా-పోలీస్” వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను గంగాధరనెల్లూరు సీఐ ప్రసాద్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిర్వాహకులతో పాటు చిత్తూరుకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చింతపండు వ్యాపారం పేరిట వల..

ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. గంగాధరనెల్లూరు మండలం మిట్టపల్లెదొడ్డివాడుకు చెందిన ఎం.నెల్సన్ (51) (ఇతనిపై ఇప్పటికే రౌడీషీట్ ఉంది), సి.లక్ష్మణ్‌కుమార్ (32), తమిళనాడు వేలూరుకు చెందిన టి.ఇళంగోవన్ (56) ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు తమిళనాడు కృష్ణగిరి జిల్లా బైరెడ్డి గ్రామానికి చెందిన వ్యాపారి మంజునాథ్‌ను టార్గెట్ చేశారు. గంగాధరనెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ ధరకే చింతపండు ఇప్పిస్తామని, భారీగా లాభాలు ఉంటాయని నమ్మబలికారు. నగదుతో వస్తే సరుకు తీసుకెళ్లవచ్చని చెప్పడంతో మంజునాథ్ రూ. 10 లక్షల నగదుతో ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరాడు.

పోలీసుల ఎంట్రీ.. నకిలీ రైడ్ డ్రామా!

మరోవైపు, మంజునాథ్ వద్ద ఉన్న రూ. 10 లక్షలను ఎలాగైనా కొట్టేయాలని ఈ ముఠా భావించింది. ఇందుకోసం తమకు ముందే పరిచయమున్న చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కె.లోకనాథం, ఏఆర్ కానిస్టేబుల్ పి.రవిచంద్రన్‌లను ఆశ్రయించింది. వారితో కలిసి పక్కా స్కెచ్ వేశారు. ముఠా సభ్యుల సూచనల ప్రకారం.. శనివారం సాయంత్రం మంజునాథ్ నగదుతో గంగాధరనెల్లూరు డంపింగ్ యార్డు వద్దకు చేరుకున్నాడు.

ముఠా సభ్యులు అతనితో మాట్లాడుతుండగానే, ప్లాన్ ప్రకారం ఏఎస్ఐ లోకనాథం, కానిస్టేబుల్ రవిచంద్రన్ ఖాకీ దుస్తుల్లో అక్కడకు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ “దొంగనోట్లు” మారుస్తున్నట్లు తమకు సమాచారం ఉందంటూ తీవ్రంగా హడావుడి చేశారు. కేసు పెట్టి జైలుకు పంపుతామని మంజునాథ్‌ను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసి, అతని వద్ద ఉన్న రూ. 10 లక్షల నగదును, మొబైల్ ఫోనును లాక్కొని అక్కడికక్కడే బైక్‌లపై జారుకున్నారు. అనంతరం ముఠా సభ్యులు కూడా నెమ్మదిగా అక్కడి నుండి తప్పించుకున్నారు.

దొంగ నోట్ల వ్యవహారమా? టెంకాయల వ్యాపారమా?

పోలీసులు ఈ కేసును చింతపండు లేదా టెంకాయల వ్యాపార లావాదేవీగా చెబుతున్నప్పటికీ, స్థానికంగా మాత్రం ఇది దొంగనోట్ల (నకిలీ కరెన్సీ) మార్పిడి వ్యవహారమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఒరిజినల్ నగదుకు మూడు, నాలుగు రెట్లు అదనంగా నకిలీ నోట్లు ఇస్తామనే ఆశతోనే తమిళనాడు వ్యాపారిని ఇక్కడికి పిలిపించారని, నిర్జన ప్రదేశమైన డంపింగ్ యార్డు వద్దకు అంత పెద్ద మొత్తంలో నగదుతో రావడం వెనుక దొంగనోట్ల మార్పిడి కోణమే దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బాధితుడి ఫిర్యాదుతో ఖాకీల ఆట కట్టింపు!

పోలీసుల డ్రామాతో హతాశుడైన బాధితుడు మంజునాథ్ ఎలాగోలా గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంటనే బాధితుడిని తన వాహనంలో ఎక్కించుకుని సంఘటనా స్థలానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వేల్కూరుచోట్ల ఏఎస్ఐ లోకనాథం, కానిస్టేబుల్ రవిచంద్రన్ కనిపించారు. బాధితుడు వెంటనే వారిని గుర్తుపట్టి సీఐకి చూపించడంతో, సీఐ వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు దొంగల ముఠా గుట్టు రట్టయింది. కొద్ది గంటల్లోనే మిగిలిన ముగ్గురు నిందితులు ఇళంగోవన్, నెల్సన్, లక్ష్మణ్‌కుమార్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 6 లక్షల నగదును రికవరీ చేశారు.

ఐదుగురు నిందితులను చిత్తూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సొంత శాఖకే మచ్చ తెచ్చిన ఏఎస్ఐ, కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *