Pawan Kalyan fan: మెగాస్టార్ చిరంజీవి కోసం పెళ్లి త్యాగం.. పవన్ కళ్యాణ్ ని చూడాలని ప్రాణాలు విడిచాడు.. తుని జనసైనికుడు కథ వింటే కన్నీళ్లు ఆగవు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి చూడాలన్న కోరిక తీరకుండానే జనసేన నేత ఠాగూర్ కన్నుమూత, కాకినాడ జీజీహెచ్‌లో మృతి, కొలిమేరు గ్రామంలో అంత్యక్రియలు, గ్రామం శోకసంద్రం

News18
News18

నన్ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లండి.. ఆయనను చూసి చనిపోతా.. అని కన్నీటి కళ్లతో కుటుంబ సభ్యులను వేడుకున్న ఆ అభిమాని గుండె.. చివరకు ఆ కోరిక తీరకుండానే ఆగిపోయింది. డిప్యూటీ సీఎం Pawan Kalyan కోసం ప్రాణం పెట్టిన ఓ జనసైనికుడి జీవితం.. చివరికి ఒక విషాదంగా ముగిసింది. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన ధారకొండ వెంకటరమణ అలియాస్ ఠాగూర్ ఇక లేడన్న వార్తతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మెగా బ్రదర్స్‌ను దేవుళ్లలా భావించిన అతడు.. చివరి శ్వాస వరకు అదే అభిమానంతో బ్రతికాడు.

చిన్నప్పటి నుంచే Chiranjeevi సినిమాలంటే ఠాగూర్‌కు పిచ్చి. కొత్త సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం సృష్టించేవాడు. చిరంజీవి అంటే అభిమానమే కాదు.. ఆరాధన. అదే ఆరాధన తర్వాత రాజకీయాల వరకు వెళ్లింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చిరంజీవి సీఎం అవుతారనే ఆశతో.. అన్నయ్య సీఎం అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను అని ఇంట్లో తేల్చి చెప్పేశాడు. కానీ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. చిరంజీవి సీఎం కాలేదు. అయితే ఠాగూర్ మాత్రం తన మాట మార్చుకోలేదు. వివాహానికి దూరంగానే ఉండిపోయాడు.

కాలం గడిచింది. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం అతడి జీవితంలో మరో ఆశను నింపింది. Jana Sena Party ఏర్పడిన రోజు నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాడు. తుని మండల జనసేన అధ్యక్షుడిగా పనిచేస్తూనే.. ఒక సాధారణ కార్యకర్తలా గ్రామాల్లో తిరిగి పార్టీ కోసం కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు.. తన కల నెరవేరినట్టే భావించి ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

కానీ అదే సమయంలో విధి అతడిని కఠినంగా పరీక్షించింది. తీవ్ర మధుమేహం కారణంగా ఆరోగ్యం క్షీణించింది. షుగర్ లెవెల్స్ అదుపు తప్పడంతో ఒక కాలు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత డయాలసిస్ సమస్యలు మరింత వేధించాయి. చివరకు మంచానికే పరిమితమయ్యాడు. ఇంట్లో పరిస్థితులు కూడా దారుణమే. సోదరుడు వికలాంగుడు.. తల్లి మతిస్థిమితం లేని స్థితిలో ఉండగా.. కుటుంబం మొత్తం కష్టాల్లో చిక్కుకుంది. అయినా ఠాగూర్ మాత్రం ఎప్పుడూ ఎవరి ముందు చేయి చాచలేదు. కుటుంబ ఆస్తులతోనే జీవితం సాగించాడు.

అయితే ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్న సమయంలో అతడి మనసులో ఒక్క కోరిక మాత్రమే మిగిలింది. పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి దగ్గరగా చూడాలి.. అనే ఆశ. అదే విషయాన్ని గత వారం రోజులుగా కుటుంబ సభ్యులకు చెబుతూ వచ్చాడు. నన్ను ఒక్కసారి పవన్ దగ్గరకు తీసుకెళ్లండి.. చూసి చనిపోతా.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో జనసైనికులు కూడా చలించిపోయారు. స్థానిక మీడియా కూడా అతడి పరిస్థితిపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వెళ్లాలని అభిమానులు కోరుకున్నారు.

కానీ విధి మరో అవకాశం ఇవ్వలేదు. కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఠాగూర్ తుది శ్వాస విడిచాడు. తన ఆరాధ్య నాయకుడిని ఒక్కసారి చూడాలన్న చివరి కోరిక.. కోరికగానే మిగిలిపోయింది. ఈ వార్త తెలిసిన వెంటనే జనసేన కార్యకర్తలు, స్థానిక అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. మెగా బ్రదర్స్‌నే తన కుటుంబంగా భావించిన వ్యక్తికి కనీసం చివరి రోజుల్లో అయినా ఆత్మీయ పరామర్శ దక్కాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఠాగూర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కొలిమేరు గ్రామంలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఠాగూర్ ఇక లేనప్పటికీ.. పవన్ కళ్యాణ్ ఒక్కసారి అతడి ఇంటికి వచ్చి కుటుంబాన్ని పరామర్శిస్తే.. అతడి ఆత్మకు శాంతి కలుగుతుందని తోటి జనసైనికులు, గ్రామస్థులు భావోద్వేగంతో చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *