స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డు విరాళం…..


విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ సందర్భంగా కూల్ డ్రింక్స్ బండి వ్యాపారి శ్రీనివాసులు స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డును విరాళంగా అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో పఠనాసక్తి, మానసిక వికాసం పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం, మేధోపరమైన ఆటల వైపు విద్యార్థులను ప్రోత్సహించడం అవసరమన్నారు. చెస్ ఆట ద్వారా ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. సమ్మర్ క్యాంప్‌కు హాజరవుతున్న విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెస్ బోర్డును అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రంథాలయాధికారి కావేరి మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌కు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు పుస్తక పఠనం, కథల వినిపింపు, పద్యాల అభ్యాసం, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీనివాసులు అందజేసిన చెస్ బోర్డు చిన్నారుల మేధో వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సమాజంలో దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, సమ్మర్ క్యాంప్‌లో పాల్గొంటున్న విద్యార్థులు, పాఠకులు పాల్గొని శ్రీనివాసులను అభినందించారు. చిన్నారులు చెస్ ఆటపై ఆసక్తి చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *