నీట్‌ లీక్‌ కేసులో సంచలనం.. కాలేజీకి వెళ్లకుండానే డాక్టర్‌గా చలామణి


సంచలనం రేపిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్‌ను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.అయితే అతడిపై దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఆశ్చర్యకర విషయాలు బయటపడుతున్నాయి.స్థానికంగా డాక్టర్‌గా పేరుపొందిన శుభం అసలు ఒక్కరోజు కూడా వైద్యకళాశాలకు వెళ్లలేదని విచారణలో తేలింది.శుభం స్వగ్రామం నందగావ్‌. నాసిక్‌లో విద్యార్థులతో ఎప్పుడూ కిక్కిరిసే శిక్షణ కేంద్రాల ప్రాంతంలో అతడు ఎస్‌ఆర్‌ విద్యా మార్గదర్శక కేంద్రం పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నాడు.ఆ కార్యాలయ బోర్డుపై తన పేరుకు ముందు డాక్టర్‌ అని పేర్కొనడంతో స్థానికంగా అందరూ అతడిని వైద్యుడిగానే భావించేవారు.

ఆయుర్వేద వైద్య విద్య కోర్సులో శుభం పేరు
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు సూచనలు ఇస్తూ వచ్చాడు.అయితే 2021లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ సమీపంలో ఉన్న శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆయుర్వేద వైద్య విద్య కోర్సులో శుభం పేరు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విషయంపై విశ్వవిద్యాలయ ఉపకులపతిని సంప్రదించగా కీలక వివరాలు బయటపడ్డాయి.
ప్రవేశం సమయంలో మాత్రమే శుభం విశ్వవిద్యాలయానికి వచ్చాడని, ఆ తర్వాత ఎప్పుడూ తరగతులకు హాజరుకాలేదని ఆయన వెల్లడించారు.
పరీక్షలు కూడా రాయలేదని తెలిపారు.

ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన పలువురు విద్యార్థులు
నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం తొలుత రాజస్థాన్‌లో బయటపడింది. అక్కడి నుంచి దర్యాప్తు సాగించిన అధికారులు ఈ లీకేజీ మూలాలు నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. శుభం తనకు పరిచయమైన వ్యక్తి నుంచి రూ.10 లక్షలకు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది.అనంతరం ఆ ప్రశ్నపత్రాన్ని పత్రరూపం నుంచి దస్త్రరూపంలోకి మార్చి వాట్సప్‌ ద్వారా గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రశ్నపత్రం రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, బిహార్‌, కేరళ తదితర రాష్ట్రాలకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. పలువురు విద్యార్థులు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించి ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

శుభం పాత్రపై సమాచారం అందుకున్న రాజస్థాన్‌ పోలీసులు మహారాష్ట్ర అధికారులను అప్రమత్తం చేశారు.దీంతో నాసిక్‌ పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే ప్రశ్నపత్రం లీక్‌ విషయం బయటపడిన వెంటనే శుభం పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకుని తిరిగినట్లు అధికారులు తెలిపారు.
డిజిటల్‌ ఆధారాల సాయంతో అతడి కదలికలను గుర్తించిన పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.
అనంతరం అతడిని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. ఈ కేసులో శుభం సోదరుడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

The post నీట్‌ లీక్‌ కేసులో సంచలనం.. కాలేజీకి వెళ్లకుండానే డాక్టర్‌గా చలామణి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *