ఏపీలో డేంజర్ వెదర్ అలర్ట్.. ఒకవైపు వర్షాలు.. మరోవైపు 43°C ఎండలు! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో ఎండ, పిడుగులతో వర్షాలు, వడగాలులు ఒకేసారి, అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కో జిల్లాలో ఒక్కోలా మారుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు మండుతున్న ఎండలు ఉక్కపోత పెంచుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.

ఈ ప్రభావంతో బుధవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు, పశుకాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు వినిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల క్రింద ఆశ్రయం తీసుకోవద్దని హెచ్చరించారు. పిడుగుల ముప్పు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని స్పష్టం చేశారు.

మరోవైపు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో వడగాలుల ముప్పు కూడా పొంచి ఉంది. అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు వేసవి తీవ్రతను మరింత స్పష్టం చేశాయి. కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 42.4 డిగ్రీలు, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.9 డిగ్రీలు, మర్కాపురం జిల్లా కంభంలో 41.7 డిగ్రీలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా గురజాలలో 41.3 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో 41.1 డిగ్రీలు నమోదు కావడం తీవ్ర ఎండలకు నిదర్శనంగా మారింది.

అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 41 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 40.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 40.5 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరులో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ, వర్షం, వడగాలులు ఒకేసారి ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *