Sri City: దక్షిణ భారతదేశానికి AC హబ్‌గా శ్రీ సిటీ.. రూ.1000 కోట్ల భారీ పెట్టుబడి..! Sri City AC manufacturing hub. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

శ్రీ సిటీ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ కండిషనర్ హబ్‌గా ఎదుగుతోంది, క్యారియర్ గ్లోబల్ సహా అనేక కంపెనీలు పెట్టుబడులు, వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి

News18
News18

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలిచిన శ్రీ సిటీ.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్ కండిషనర్ల తయారీ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ గ్లోబల్ కంపెనీలు వరుసగా తమ తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తుండటంతో శ్రీ సిటీ పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

డైకిన్, ఎల్జీ, హ్యావెల్స్, బ్లూస్టార్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, హైసెన్స్, డెన్మార్క్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు వైకెక్, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్, అడెలా ఎలక్ట్రానిక్స్, ఈప్యార్ సహా మొత్తం 32 విడిభాగాల సరఫరా సంస్థలు ఇప్పటికే శ్రీ సిటీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఎయిర్ కండిషనర్లలో దాదాపు 40 శాతం శ్రీ సిటీలోనే తయారవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ వాటా 70 శాతానికి చేరే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత AC తయారీ సంస్థ క్యారియర్ గ్లోబల్ కూడా ఇప్పుడు శ్రీ సిటీలో భారీ పెట్టుబడితో అడుగుపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రూ.1000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ.. సాధారణ ఇళ్లలో వినియోగించే ఒకటి, రెండు టన్నుల ACలతో పాటు డేటా సెంటర్లు, భారీ పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యం కలిగిన కూలింగ్ సిస్టమ్స్‌ను కూడా తయారు చేయనుంది.

శ్రీ సిటీ పరిధిలోని ఆరూరు ప్రాంతంలో ఈ పరిశ్రమ కోసం 40 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం విశేషం. భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి తయారీ యూనిట్లతో శ్రీ సిటీ దేశ పారిశ్రామిక పటంలో మరింత కీలకంగా మారుతోంది.

పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కారణంగానే ప్రముఖ కంపెనీలు శ్రీ సిటీ వైపు ఆకర్షితులవుతున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో శ్రీ సిటీ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. దేశ ఆర్థికాభివృద్ధికి కీలక కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *