14న జరిగే కేబినెట్ భేటీలోనైనా చర్చిస్తారా?
ఇనాం భూబాధితుల ఎదురుచూపులు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఇనాం భూబాధిత కుటుంబాలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సొంత ఇల్లు, కరెంటు మీటరు, ఏళ్ల తరబడి కట్టిన పన్ను రసీదులు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు వంటి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ ఆస్తులను అమ్ముకోవడా నికి లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి వీలులేని దుస్థితితో అల్లాడిపోతున్నారు. ఈ సమస్య మÖలం 1956 ఇనాం చట్టంలో ఉండగా, 2013లో అప్పటి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సవరణలో ‘ప్రాస్పెక్టివ’కు బదులు ‘రెట్రాస్పెక్టివ’ అని పేర్కొనడంతో 1956 నుంచి జారీ అయిన రైతువారీ పట్టాలన్నీ నిషిద్ధ జాబితాలోకి చేరిపోయాయి. దీనివల్ల ఉమ్మడి గుంటూరు, కృష్ణా, గోదావరి, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో కలిపి సుమారు 25 వేల ఎకరాల భూమి 22ఏ-సీ జాబితాలో చిక్కుకుపోయింది. రాష్ట్ర విభజన అనంతరం ఇనాం భూభాదితులు సంఘంగా ఏర్పడి వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో 2018 చివరిలో నాటి చంద్రబాబు సర్కార్ ఈ సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ తెచ్చి కేంద్ర ఆమోదం పొందినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో ఆ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిపోయింది. సమస్య యదాతథంగా ఉండిపోయింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇనాం భూబాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గతంలో వైసీపీకి మద్దతుగా తిరిగిన చాలా కుటుంబాలు ఎన్నికల సమయంలో కూటమికి మద్దతు పలికాయి. తర్వాత చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఇనాం భూబాధితుల్లో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వివిధ రకాల నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో తాడేపల్లి, నందిగామ తదితర ప్రాంతాలకు చెందిన ఇనాం భూబాధితులు కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్డినెన్స్ జారీ అయి కూడా ఫ్రీహోల్డ్ కాకుండా ఉన్న ఈ భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. అయితే ప్రభుత్వం వివిధ రకాల నిషేధిత భూములను విడతల వారీగా ఫ్రీ హోల్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇటీవలే వైసీపీ హయాంలో నిషేధిత జాబితాలో చేరిన (షరతుగల పట్టా/కండిషనల్ పట్టా) భూములను ప్రీహోల్డ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 15 జిల్లాల పరిధిలో 33,440.62 ఎకరాల షరతుగల పట్టా భూములకు మోక్షం కలిగించింది. అంతకుముందు గ్రామ సర్వీసు ఇనాం భూములను ప్రీహోల్డ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ రైతు వారి పట్టాల (ఇనాం భూముల) అంశానికి మాత్రం మోక్షం కలిగించలేదు. విడతల వారీగా వివిధ రకాల నిషేధిత భూములను ప్రీహోల్డ్ చేస్తుండటంతో తమ వంతు ఎప్ప్పుడా అని వీరు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నెల 14 న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అయినా తమ సమస్యపై చర్చించి, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి తమ భూములకు విముక్తి కల్పించాలని ఇనాం భూబాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


