Last Updated:
శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు పొందింది, సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. కోర్సు ప్రారంభించి 16 మంది వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చింది
తెలుగు రాష్ట్రాల వైద్య రంగంలో శ్రీకాకుళం జిల్లా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంగ్లాండ్‌కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి గుర్తింపు పొందిన తొలి సంస్థగా జెమ్స్ హాస్పిటల్ నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ గుర్తింపు కేవలం ఆసుపత్రికే కాదు.. తెలుగు రాష్ట్రాల వైద్య రంగానికి దక్కిన గౌరవంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సందర్భంగా జెమ్స్ హాస్పిటల్‌లో తొలిసారిగా సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. (క్రిటికల్ కేర్ ఆఫ్ సర్జికల్ పేషెంట్) ప్రొవైడర్ కోర్సును విజయవంతంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ద్వారా 16 మంది వైద్యులకు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శస్త్రచికిత్స రోగులను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో ఆధునిక పద్ధతుల్లో శిక్షణ అందించారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా జెమ్స్ చీఫ్ పెట్రన్ డాక్టర్ బి. భాస్కరరావు మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నుంచి గుర్తింపు పొందడం తమ సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు. అదే సమయంలో రాయల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. కోర్సును నిర్వహించే అవకాశం రావడం మరింత ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మంది వైద్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక కోర్సును నిర్వహిస్తున్న తొలి మరియు ఏకైక కేంద్రంగా కూడా జెమ్స్ & హెచ్ నిలవడం విశేషం. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో శస్త్రచికిత్సకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల సంరక్షణ, క్లినికల్ నిర్ణయాలు తీసుకునే విధానం వంటి అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు.
సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. కోర్స్ డైరెక్టర్, ప్రముఖ జీఐ సర్జన్ డాక్టర్ ఎంబీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కోర్సును పూర్తిగా ప్రాక్టికల్ శిక్షణ, రియల్ టైమ్ మెడికల్ సిట్యుయేషన్స్ ఆధారంగా రూపొందించామని తెలిపారు. ముఖ్యంగా జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ విభాగాల్లో శిక్షణ పొందుతున్న వైద్యులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు ఇప్పుడు శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు చేరుకోవడం వైద్య రంగ అభివృద్ధికి నిదర్శనంగా మారింది. జెమ్స్ సాధించిన ఈ ఘనత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Srikakulam,Andhra Pradesh
May 07, 2026 10:03 PM IST


