పాటతో ప్రజల్లో చైతన్యం – Visalaandhra


*కళల పరిరక్షణలో ప్రజానాట్యమండలిది కీలక పాత్ర
*బీజేపీ పాలనలో సంస్కృతిపై దాడులు
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథ్ రెడ్డి

                  (విశాలాంధ్ర-తిరుపతి)

‘‘పాటతో ప్రజల్లో చైతన్యం వస్తుంది. కళల పరిరక్షణలో ప్రజానాట్య మండలి కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో ఉద్యమాల్లో కళాకారులే కీలక పాత్ర పోషించారు. డప్పు పాట ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నేడు పాలకులు ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. తమిళనాడులో సామాజిక రుగ్మతల్ని వెలుగులోకి తీసుకొస్తే రచయితపై కేసులు బనాయించారు. దేశ వ్యాప్తంగా బావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. కవులు, కళాకారులు, రచయితలపై నిర్బంధం విధిస్తున్నారు. బీజేపీ పాలనతో సంస్కృతిపై విపరీతమైన దాడి జరుగుతోంది. ఈ దాడులను ఎదుర్కోవడానికి కళకారులు ఏకం కావాలి. కళాకారులకు ప్రజలు అండగా నిలవాలి.’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి అన్నారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్ లో గురువారం ప్రజా నాట్యమండలి రాయలసీమ స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పుట్టా హరినాధరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేడు వస్తున్న సినిమాల్లో ఎక్కడో ఒక చోట జై శ్రీరామ్ అనే పదం వస్తే… ఆ సినిమాలో అశ్లీలం ఉన్న సెన్సార్ బోర్డు అనుమతులు ఇచ్చేస్తున్నాయని ధ్వజమెత్తారు. శాస్త్రీయ దృక్పథంతో మొదలయ్యే సినిమా చివరకు అతీత శక్తి వలనే జరిగింది అని సినిమాల్లో చూపించి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో సాంస్కృతిక వ్యవస్థపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ నేపధ్యంలో అభ్యుదయ రచయితలు, కవులు, కళాకారులు బలమైన శక్తిగా ఏర్పడి సంస్కృతులను కాపాడుకోవలసిన బాధ్యత ఉందని పుట్టా హరినాథరెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇక ప్రజానాట్య మండలి రాష్ట్ర బాధ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి నిర్మాణాన్ని పటిష్టం చేయడం జరుగుతుందన్నారు. కళాకారులు ఆట, పాటతో పాటు చిన్న నాటకాలు వేయడం… ప్రజా సమస్యలపై రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కళాకారులు వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలకుల విదానాలతో ప్రజా కళలు మరుగున పడిపోయే ప్రమాద పరిస్థితి వచ్చిందన్నారు. నేటి పిల్లలు సినిమాల్లో వచ్చే అర్థం లేని పాటలకు అలవాటు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా నాట్య మండలి కీలక పాత్ర పోషించాలని రామచంద్రయ్య సూచించారు. గంట ఉపన్యాసం కంటే ఒక పాట ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొస్తుంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ రామకృష్ణ, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఎస్ గుర్రప్ప, శివయ్య, చంద్ర శేఖర్, తిరుపతి జిల్లా కార్యదర్శి జె నాగరాజు, కడప జిల్లా కార్యదర్శి శ్రీనివాస వర్మ, సత్యసాయి జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్, చిత్తూరు జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, నెల్లూరు జిల్లా కార్యదర్శి తల్లు శీనయ్య, తిరుపతి జిల్లా అధ్యక్షులు కె.చారులత, కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంకటరాముడు, నంద్యాల జిల్లా అధ్యక్షులు, వాసు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *