రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra


. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం
. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నాయి. వీటితో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 17వ ఎసఐపీబీ సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో…ఎంఎసఎంఈలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, పరిశ్రమల యజమానులు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని స్పష్టం చేశారు. ఒక పెట్టుబడి, పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. అనుమతుల జారీలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమన్నది చాటి చెప్పాలన్నారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు.
వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యుర్ విషయంలో ఎంఎసఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం అన్నారు. అన్ని పారిశ్రామిక ప్రాంతాలకు గ్యాస్ పైప్‌లైన్ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని, రాష్ట్రంలో ఉద్యాన, వాణిజ్య పంట ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలని, ఆయిల్ పామ్, మామిడి, కొబ్బరి, కోకో సహా అనేక పంటలకు వ్యాల్యూ అడిషన్ ఇస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సీఎం అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సుభాష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల అధికారులు, వర్చువల్‌గా మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
ఆమోదం పొందిన ప్రతిపాదనలు
1.రిలయన్స్ ఇండస్ట్రీస్ – శ్రీసత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు రూ.51,300 కోట్ల పెట్టుబడులు, 20 వేల మందికి ఉద్యోగాలు
2.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ త్రీ లిమిటెడ్, నంద్యాలలో రూ.155 కోట్ల పెట్టుబడులు, 40 మందికి ఉద్యోగాలు
3.క్లీన్ ఎనర్జీ హైబ్రీడ్ ట్వెల్వ్ లిమిటెడ్, అనంతపురం జిల్లా రూ.779 కోట్ల పెట్టుబడులు, 125 మందికి ఉద్యోగాలు
4.క్లీన్ ఎనర్జీ హైబ్రీడ్ థర్టీన్ లిమిటెడ్, అనంతపురం జిల్లా రూ.779 కోట్ల పెట్టుబడులు, 125 మందికి ఉద్యోగాలు
5.అదాని హైడ్రో ఎనర్జీ ఎలెవెన్, కడప జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రూ.12,297 కోట్ల పెట్టుబడులు, 3375 మందికి ఉద్యోగాలు
6.యమాన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ రూ.9398 కోట్ల పెట్టుబడులు, 5820 మందికి ఉద్యోగాలు
7.అమృత శ్రీ బయో సీఎన్జీ లిమిటెడ్, విజయనగరం రూ.89 కోట్ల పెట్టుబడులు, 402 మందికి ఉద్యోగాలు
8.బాలాజీ బయోఎనర్జీ ఆర్గానిక్స్, నెల్లూరు జిల్లా రూ.59 కోట్ల పెట్టుబడులు, 335 మందికి ఉద్యోగాలు
9.హెచ్‌పీసీఎల్ రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ, ఏలూరు జిల్లా రూ.100 కోట్ల పెట్టుబడులు, 150 మందికి ఉద్యోగాలు
10.ఎనర్జియా బయో ఫ్యూయల్స్, తిరుపతి జిల్లాలో సీబీజీ ప్లాంట్ రూ.59 కోట్ల పెట్టుబడులు, 335 మందికి ఉద్యోగాలు
11.విభా బయో ఫ్యూయల్స్, తూర్పుగోదావరి జిల్లా రూ.67 కోట్ల పెట్టుబడులు, 110 మందికి ఉద్యోగాలు
12.ఐఓసీ జీపీఎస్ రెన్యువబుల్స్, ఎన్టీఆర్ జిల్లాలో సీబీజీ ప్లాంట్ రూ.120 కోట్లు పెట్టుబడులు, 200 మందికి ఉద్యోగాలు
13.డెల్టా బయోగ్యాస్, పలనాడు జిల్లా రూ.100 కోట్లు పెట్టుబడులు, 750 మందికి ఉద్యోగాలు
14.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విశాఖలో డేటాసెంటర్ ఏర్పాటు రూ.1,08,010 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు
15.క్యారియర్ ఎయిర్ కండిషనింగ్, తిరుపతి జిల్లాలో బల్క్ చిల్లర్స్ తయారీ రూ.863 కోట్ల పెట్టుబడులు, 721 మందికి ఉద్యోగాలు.
16.ఎనఎస్టీఎల్ డీఆర్డీఓ, అమరావతి క్వాంటం వ్యాలీ రూ.22.5 కోట్ల పెట్టుబడి, 20 మందికి ఉద్యోగాలు
17.స్నేహా ఫార్మ్స్ లిమిటెడ్, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు, రూ.277.94 కోట్ల పెట్టుబడులు, 435 మందికి ఉద్యోగాలు
18.గ్రైడోన్ ఎనర్జీ లిమిటెడ్, కర్నూలు జిల్లా, రూ.3149 కోట్ల పెట్టుబడులు, 320 ఉద్యోగాలు
19.అపోలో టైర్స్, తిరుపతి జిల్లా శ్రీసిటీ రూ.6100 కోట్లు పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు
20.ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్సెస్ ఇఫ్కో సెజ్, నెల్లూరు, రూ.3153 కోట్ల పెట్టుబడులు, 172 మందికి ఉద్యోగాలు
21.రాయల్ ఎన్‌ఫీల్డ్, తిరుపతి జిల్లా, రూ.2508 కోట్ల పెట్టుబడులు, 3 వేల మందికి ఉద్యోగాలు
22.చెట్టినాడ్ సిమెంట్స్, పలనాడు జిల్లా, రూ.1340 కోట్లు పెట్టుబడులు, 360 మందికి ఉద్యోగాలు
23.ఏఏకే సౌత్ ఈస్ట్ ఇండియా, కాకినాడ జిల్లా, రూ.171.52 కోట్ల పెట్టుబడులు, 102 మందికి ఉద్యోగాలు
24.ఐటీసీ లిమిటెడ్, గుంటూరు జిల్లా రూ.51.65 కోట్ల పెట్టుబడులు, 50 మందికి ఉద్యోగాలు
25.హ్యాంగ్యో ఐస్ క్రీమ్స్, తిరుపతి జిల్లా రూ.74.49 కోట్ల పెట్టుబడులు, 110 మందికి ఉద్యోగాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *