Last Updated:
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు రోజులు ఉరుములు పిడుగులతో వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాలులు, 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, ప్రజలు రైతులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో గురువారం శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అనేక జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో పొలాల్లో ఉండరాదని సూచించారు.
ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని హెచ్చరించారు. అల్లూరి జిల్లా జికే వీధి, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ముంచింగిపుట్టు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రాపురం ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండ తీవ్రత ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 41.6°C, తిరుపతి జిల్లాలో 41.2°C, చింతూరులో 41°C, అనంతపురంలో 40.7°C, నంద్యాలలో 40.6°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 39°C పైగా ఉష్ణోగ్రతలు కొనసాగుతుండటంతో ఉక్కపోత కూడా పెరిగింది. వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కువసేపు కురవకపోయినా, తక్కువ సమయంలో గట్టిగా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, ఎత్తైన భవనాల వద్ద నిలబడకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. ఎండ తీవ్రత, వర్షాలు, గాలుల మధ్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


