. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ధర్నాలు
. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి: కేవీవీ ప్రసాద్
. కేంద్రంపై సీఎం ఒత్తిడి పెంచాలి: జమలయ్య
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:మొక్కజొన్నకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,400 చెల్లించాలని, ఇప్పటికే మార్కెట్లో అమ్ముకుని నష్టపోయిన రైతాంగాన్ని ధరల వ్యత్యాస పథకం ద్వారా ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, పంట మొత్తం కొనుగోళ్లు జరిపేలా కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం(ఏఐకేఎస్) పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నాలు, వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లా పెదకాకాని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో కేవీవీ ప్రసాద్ పాల్గొన్నారు. పుప్పాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నా… ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది సుమారు 5.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ఎకరానికి సగటు దిగుబడి సుమారు 30 క్వింటాళ్లుగా నమోదవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు 2,400గా ఉన్నప్పటికీ… ప్రస్తుత మార్కెట్లో కేవలం రూ.1700 మాత్రమే ధర పలుకుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రతి క్వింటాకు సుమారు రూ.700 పైగా నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ లెక్కన సుమారు రైతు పండించిన పంటకు ఎకరాకు రూ.21 వేల వరకు నష్టం వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు దాదాపు రూ.2,600 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని వివరించారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్, నాఫెడ్ కేంద్రాల ఏర్పాటుతో క్వింటా రూ.2400లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, తాడికొండ నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి ముప్పాళ్ళ శివ ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఒత్తిడి పెంచాలి: జమలయ్య
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.2,400 మద్దతు ధరతో మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ… వ్యాపారులు రూ.1,700కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి… మొక్కజొన్న రైతులకు మార్కెట్లో మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకారం మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ఏఐటీయÖసీ రాష్ట్రసమితి సభ్యులు పి.నాగ ఆంజనేయులు, రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ, పట్టణ సీనియర్ నాయకులు కన్నెగంటి రమేష్ బాబు, వంగర శ్రీనివాసరావు, చెరుకూరి లక్ష్మణరావు, దోవ రమేష్, రామ్ జి, పోతర్లంక శివ, వెంకటేశ్వరరావు, వెంకట్రావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో రాస్తారోకో చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య, రైతు సంఘం నాయకులు తక్కెలపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగంది. సీపీఐ ఏలూరు నియోజకవర్గ కార్యదర్శి ఉప్ప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శులు కురెళ్ల వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ అధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ నాయకులు కుంచె వసంతరావు, లొట్టి వెంకటేశ్వరరావు, తాళ్లూరి నాగరాజు, పెనుమాకుల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సీపీఐ కొయ్యలగూడెం మండల కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు డిప్యూటీ తహసీల్దారు వై.వెంకటలక్ష్మి కుమారికి వినతిపత్రం అందజేశారు. మండల సహాయ కార్యదర్శి ఎల్.లక్ష్మణ్ రావు, ఏఐటీయÖసీ¾ నాయకులు బొబ్బర చిట్టిబాబు, కౌలు రైతులు వంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ్పసాద్కు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడు యలమందరావు వినతిపత్రం సమర్పించారు. రైతు సంఘం నాయకులు చెరుకూరి సుబ్బారావు, నిమ్మగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
The post మొక్కజొన్నకు రూ.2400 ఇవ్వాల్సిందే appeared first on Visalaandhra.


