క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఒక డిగ్రీ మేర తగ్గిన ఉష్ణోగ్రతలు
రెండు మూడు రోజుల్లో మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. సాయంత్రం దాకా ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఎండ తీక్షణంగా కాస్తోంది.కాగా, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేర తగ్గాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ నెల 8వ తేదీ నుంచి మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపారు. ఈరోజు, రేపు, ఎల్లుండి క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


