అధికారుల నిర్లక్ష్యం.. విడపనకల్లులో ‘ఇసుక’ దందా..


విశాలాంధ్ర – విడపనకల్లు: విడపనకల్లు మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా పరాకాష్టకు చేరుకుంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఇసుక మాఫియా పట్టపగలే జాతీయ రహదారిపై ఇసుకను తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తోంది. ప్రభుత్వం “ఉచిత ఇసుక” అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం దళారుల ఆధీనంలోనే ఇసుక పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సాధారణ ప్రజలు తమ అవసరాల కోసం ఇసుక కోరితే అందుబాటులో లేదని చెప్పబడుతుండగా, మధ్యవర్తుల ద్వారా మాత్రం సులభంగా లభిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.3,000 వరకు విక్రయిస్తూ అక్రమార్కులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేసే వాహనాలకు కమర్షియల్ (ఎల్లో) నెంబర్ ప్లేట్లు ఉండాలి. అయితే ఇక్కడ వైట్ నెంబర్ ప్లేట్లతో ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ట్రాక్టర్లపై తార్పాలు కప్పకపోవడంతో రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, వాటి ఎదుటే ఈ అక్రమ రవాణా నిర్భయంగా కొనసాగడం గమనార్హం.ఇదిలా ఉండగా, స్థానిక రెవెన్యూ అధికారుల బాధ్యతారాహిత్యం బయటపడింది. అక్రమ ఇసుక రవాణాపై స్పందించాల్సిందిగా అడిగితే, “రాత్రంతా కాపలా కాయడం మా పని కాదు, పోలీసులు చూసుకోవాలి” అంటూ నిర్లక్ష్యంగా స్పందించినట్లు సమాచారం.మరోవైపు, పోలీసుల వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. పోలీసులు బాధ్యతారాహిత్య సమాధానాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్ వ్యవస్థ కూడా నిర్వీర్యమైందని విమర్శలు వస్తున్నాయి. ఒక పౌరుడు చేసిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే గడువు ముగిసిన తర్వాత రాత్రి సమయంలో ఫిర్యాదును మూసివేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించే పోలీసులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇసుక ట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఓ అధికారులు కూడా ఈ ప్రాంతంలో తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *