కమర్షియల్ సిలిండర్ ధర పెంపు అన్యాయం.. విశాఖలో భారీ నిరసనలు..! commercial gas cylinder price hike. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నంలో ప్రజా సంఘాలు, సిపిఐ, సిఐటియు నేతృత్వంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.993 పెంపు వ్యతిరేకంగా ఆందోళనలు, కేంద్రం వెంటనే పెంపు రద్దు చేయాలని డిమాండ్

+

News18

News18

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్‌పై రూ.993 వరకు ధర పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, వెంటనే ఆ పెంపును రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. నగరంలోని జగదాంబ బస్ స్టాప్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసనలు చేపట్టిన కార్యకర్తలు, పెరిగిన ధరలతో చిన్న వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా లోపించి, అందుబాటులో లేకపోవడం వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ధరలను భారీగా పెంచడం అన్యాయమని, నగరంలో అనేక చిన్న రెస్టారెంట్లు, వ్యాపారాలు మూతపడటంతో వందలాది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు.

ఇక సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ మాట్లాడుతూ.. మే ఒకటి నుంచి కమర్షియల్ సిలిండర్‌పై రూ.993 పెంపు అమలు చేయడం ద్వారా చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపారని తీవ్రంగా విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం అన్యాయమని, దీన్ని మేడే కానుకగా ఇవ్వడం వ్యంగ్యాస్పదమన్నారు. మద్దిలపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొని, వెంటనే ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో ఆయిల్ ధరలు పెరగడం, గ్యాస్ కొరత ఏర్పడడం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని నేతలు పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం, రష్యాతో చమురు కొనుగోలు చేయకపోవడం వంటి కారణాలతో పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. మన రాష్ట్రంలో గ్యాస్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం కూడా సమస్యలను పెంచిందని విమర్శించారు.

యుద్ధం తాత్కాలికంగా ఆగినా ధరల మంట మాత్రం ఆగడం లేదని, రాబోయే రోజుల్లో గృహ వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని స్పష్టం చేశారు. చిరు వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ సిఐటియు పోరాటాలు కొనసాగిస్తుందని నేతలు తెలిపారు. రాబోయే ఉద్యమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *