Andhra Pradesh: నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఈ పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని వమిడెముక్కలలో జరిగే ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

cm chandrababu
cm chandrababu

Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు మే 1వ తేదీ శుక్రవారం కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడపనున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమం, మేడే వేడుకలతో పాటు ఆసుపత్రి ప్రారంభోత్సవం వంటి కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని వమిడెముక్కలలో జరిగే ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటిస్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ప్రతి నెలా 2.34 లక్షల మందికి రూ. 102 కోట్ల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. వమిడెముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి పింఛను అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు.

అనంతరం మేడేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత పామర్రు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

శుక్రవారం ఉదయం 10:15 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి వమిడెముక్కల మండలం వీరంకిలాకు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:25 గంటలకు వమిడెముక్కల ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 గంటలకు భవన నిర్మాణ కార్మికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1:55 గంటలకు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:40 గంటలకు గుడ్లవల్లేరు చేరుకుని, 3:50 గంటలకు అక్కడ నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

కుప్పం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్

చిత్తూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కుప్పం విమానాశ్రయం కోసం చేపట్టిన భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ముందుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

భూసేకరణ చట్టబద్ధమే

ఈ ప్రాజెక్టు కోసం సుమారు 150 ఎకరాల భూమిని సేకరించేందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చింది. భూమి అనుకూలతపై సరైన ఆధారాలు లేవంటూ చక్రపాణి రెడ్డి, ఇతరులు చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర అనుబంధ పిటిషన్లు కూడా ముగిసినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న న్యాయపరమైన అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.

అభివృద్ధికి మార్గం సుగమం

ఈ తీర్పుతో కుప్పం విమానాశ్రయ పనులు త్వరలోనే వేగవంతం కానున్నాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెరుగుదల వంటి అంశాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. కుప్పం విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ, సమీప ప్రాంతాల ఆర్థిక వృద్ధి, టూరిజం అభివృద్ధి వంటి ప్రయోజనాలు కలగనున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *